కో-లివింగ్ హాస్టల్ భవనంలో అగ్ని ప్రమాదం
శేరిలింగంపల్లి,జూన్ 20(విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని హఫీజ్పేట్ మార్తాండ నగర్లో ఉన్న ఒక కో-లివింగ్ హాస్టల్ భవనంలో శనివారం హఠాత్తుగా భారీగా మంటలు చెల రేగాయి. భవనం నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందు కున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మం టలను అదుపులోకి తెచ్చేందుకు భారీ స్థా యిలో ప్రయత్నాలు చేశారు.
హాస్టల్ భవనంలో వ్యాపించిన మంటలు కొంత సమ యం తర్వాత అదుపులోకి వచ్చాయి.ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ పెద్ద ముప్పు తప్పింది.భవనంలో ఉన్న హాస్టల్ నివాసితులు, ఎక్కువగా ఐటీ ఉద్యోగులు సమయానికి అప్రమత్తమై మంటలు పెద్దవి కాకముందే సురక్షితంగా భవనం వెలుపలికి వచ్చేశారు.దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు,పోలీసు,అగ్నిమాపక శాఖలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రమాదానికి కారణం ఏమిటనేది ప్రస్తుతం తెలియరాలేదు.
అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. హాస్టల్ భవనంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది కూడా అంచనా వేస్తున్నారు.ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కో-లివింగ్ హాస్టల్స్లో అగ్ని సురక్షా ప్రమాణాలు సరిగా పాటించడంలేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






