18 May, 2026 | 5:01 AM

కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం

18-05-2026 12:00 AM
  1. ఖాళీ గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు దగ్ధం 
  2. ధాన్యం రాశికి నిప్పంటించిన దుండగులు!
  3. సూర్యాపేట జిల్లా బొల్లంపల్లిలో ఘటన

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 17 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పార బట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఓ రైతుకు చెందిన లారీ ధాన్యం రాశికి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. గాలి దిశమారి పక్కనే ఉన్న ఖాళీ గన్ని బ్యాగులకు అంటుకుంది. స్థానికులు, కేంద్రం నిర్వాహకులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. సూర్యాపేట నుంచి ఫైర్ ఇంజన్‌ను పిలిపించి గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పేశారు.

అప్పటికే 3,800 ఖాళీ గన్నీబ్యాగులు, 6 టార్పాలిన్లు పూర్తిగా కాలిపోయాయి. రైతు మురళి ధాన్యం రాశికి నిప్పంటుకోగా నీళ్లు పోసి మంటలను ఆర్పారు. ఘటన స్థలాన్ని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు,అదనపు డీఆర్డీఓ సురేష్ సందర్శించారు. కాలిపోయిన సామాగ్రి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. జరిగిన సంఘటనపై ఐకేపీ నిర్వాహకు లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ వెంట డీపీఎంలు అరుణ్, బెనర్జీ, తహసీల్దార్ బి శ్రీకాంత్, ఎస్‌ఐ సైదులు, ఏపీఎం, సీసీలు ఉన్నారు.