18 May, 2026 | 3:50 AM

పోరాట ఫలితమే కేకే కమిటీ

18-05-2026 12:00 AM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ శ్రీనివాస్

కుషాయిగూడ, మే 17 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం తొమ్మిదేళ్లుగా సాగించిన ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమకారులను రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరించిన సమయంలో పిడికెడు మందితో ఫోరంను ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఐక్యం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చామని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల కోసం 33 జిల్లాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, పాదయాత్రలు, పోస్టుకార్డు ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల కోసం 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ హామీలు చేర్చడంలో ఫోరం పాత్ర ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం, తెలంగాణ పునర్నిర్మాణమే ఫోరం లక్ష్యమని చీమ శ్రీనివాస్ స్పష్టం చేశారు.