13 May, 2026 | 2:12 AM

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

13-05-2026 12:39 AM

 బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్, మే 12 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం పరిధిలోని కైలాష్‌హిల్స్, ఈవెంటురెన్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం పరిశీలించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఫ్లాట్‌నంబర్ 201 పూర్తిగా దగ్ధమవ్వగా, పలు ఫ్లాట్‌లు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రమాదం జరిగిన ఫ్లాట్లను పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడం అదృష్టకరమని అన్నారు. అగ్నిప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్ నిర్మాణ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని, దీనిపై ‘స్ట్రక్చరల్ అసెస్మెంట్’ నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవనం ఎంతవరకు సురక్షితం? భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల నివేదిక అవసరమని పేర్కొన్నారు.

హౌసింగ్ మినిష్టర్‌తో జరగనున్న సమావేశంలో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, స్ట్రక్చరల్ ఇంజనీర్లతో భవనాన్ని తనిఖీ చేయించి, బాధితులను ఆదుకోవాలని కోరతామని హామీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులకు అండగా ఉంటామని, నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం సాధ్యమైనంత సాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ సెల్ కోకన్వీనర్ గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, కేకేపి బీజేపీ కాంతారావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు బక్క శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.