పటాన్‌చెరులో భారీ అగ్ని ప్రమాదం!
- శ్రీరామ్ ఆటో మాల్‌లో ఘటన
- సీజ్ చేసిన టిప్పర్లు, డీసీఎం, కార్లు దగ్ధం
- షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానాలు
పటాన్‌చెరు, మే 12: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల శివారులోని ఇంద్రేశం రోడ్డు మార్గంలో ఉన్న శ్రీరామ్ ఆటో ఫైనాన్స్‌కు చెందిన వాహనాల మాల్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు టిప్పర్లు, వ్యాన్, రెండు ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటితో పాటు పార్కింగ్ చేసిన మరికొన్ని కార్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇలావుండగా గోదాంలో సరియైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వాహనాల మధ్య దూరం లేకపోవడంతో అగ్ని ప్రమాదం జరిగి పెద్దమొత్తంలో వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు చెపుతున్నారు. అయితే ఈ వాహనాలన్నీ సీజ్ చేసిన వాహనాలే కావడం గమనార్హం. ప్రమాదంలో ఎంత ఆస్తినష్టం జరిగింది యాజమాన్యం వెల్లడించలేదు.






