ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం
తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్
ముషీరాబాద్, మే12 (విజయక్రాంతి): ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన సంస్థల్లో మీడియా ఒకటని, జర్నలిస్టులు సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మీడియా డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అత్యంత కీలకమన్నారు.
రాష్ట్రంలోని రాజకీయ, ఆర్థిక, విద్య, వైద్య, సాంకేతిక రంగాల అభివృద్ధిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, ప్రజల మధ్య జర్నలిస్టులు వారధిగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి, సీనియర్ పాత్రికేయులు చిలుకూరు అఖిలేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే జర్నలిజం వృత్తికి అంకిత భావంతో సేవలందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పగుడాకుల బాలాస్వామి, ప్రధాన కార్యదర్శి జూలురు రమేష్, ఉపాధ్యక్షుడు లక్కాకుల ప్రవీణ్ కుమార్ తదితరులు నూతన డీజీపీని కలిసి అభినందనలు తెలిపారు.






