మానకొండూరులో అగ్నిప్రమాదం
అగ్నికి ఆహుతైన ఇల్లు
రెండు లక్షల నగదు గృహోపకరణాలు అగ్నికి ఆహుతి
మానకొండూరు,(విజయక్రాంతి): మండల,నియోజకవర్గ కేంద్రమైన మానకొండూరు(Manakondur)లో మంగళవారం పెంకుటిల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రెండు లక్షల నగదు తో పాటు, బట్టలు, గృహోపకరణాలు, వెండి వస్తువులు కాలి బూడిదయ్యాయి. మానకొండూరులో తంతి, తపాలా కార్యాలయం(Post office) వీధిలో ఇరుగురాళ్ల పోచయ్యకు చెందిన పెంకుటింటిలో సుమారు సంవత్సర కాలంగా కోండ్ర శంకరమ్మ, సునంద, ఎల్లయ్యలు అద్దెకు ఉంటున్నారు.
కోండ్ర శంకరమ్మ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంది. శంకరమ్మ మంగళవారం ఉదయం ఇంట్లో దీపం వెలిగించి విధులకు వెళ్లింది. ఇంట్లో దేవుని ముందు వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కిందపడి కిందనున్న బట్టలకు మంటలు అంటుకొని ఇల్లంతా వ్యాపించాయి. చుట్టుపక్కల వారు అగ్ని మాపక అధికారులకు(fire officers) ఫోన్ చేయడంతో కరీంనగర్, మానకొండూరు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. శంకరమ్మకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరయింది. ఇంటి నిర్మాణ పనులకు తెచ్చుకున్న రెండు లక్షల రూపాయలు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో, నిరాశ్రలైనా శంకరమ్మ కుటుంబ దయనీయమైన పరిస్థితి చూసి చెలించిన మానకొండూరు అగ్నిమాపక అధికారి వి. సురేందర్ 4,000 రూపాయలను నగదు అందించి తన ఉదారతను చాటుకున్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ, తహసిల్దార్ సందర్శించారు.






