22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి
భూపాలపల్లి,(విజయక్రాంతి): 22ఏ పరిధిలోని భూములను మండల, గ్రామాల వారీగా సమగ్రంగా పరిశీలించి ఖచ్చితమైన వివరాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో భూ రీ-సర్వే, భూ భారతి, సాదా బైనామాలు, రెవెన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2016, 2021లోని వివరాలను ప్రస్తుత సమాచారంతో పోల్చి వ్యత్యాసాలు ఉంటే కారణాలను గుర్తించి సవరణలు చేపట్టాలని సూచించారు. అటవీ, సాగునీటి ప్రాజెక్టులు, సింగరేణి భూముల వాస్తవ స్వభావాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం వర్గీకరించాలన్నారు.రీ-సర్వే పనులను వేగవంతం చేసి ప్రతి వారం పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. నవంబర్ 30లోగా ప్రతి మండలం నుంచి పూర్తి నివేదికలు సమర్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.






