1 September, 2026 | 10:41 PM

కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం

01-09-2026 | 10:01pm

- సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుందని, ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారా దత్తం చేస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి(Former MLA Chada Venkata Reddy) అన్నారు.  మంగళవారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ  బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను 22 వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ శక్తులకు మాఫీ చేసిందని, పేదలు రైతులు తీసుకున్న రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదన్నారు. దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని, ఢిల్లీ నడిబొట్టున ఆదివాసి బిడ్డ శిరీష ను సామూహిక అత్యాచారం చేసిన వారిని శిక్షించడంలో బిజెపి ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు.

కేంద్రంలో, మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడి హెట్టి  బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చొరవ తీసుకొని యంత్రాంగ ప్రక్షాళన చేయాలని అందుకోసం అవసరమైతే అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకులతో, రిటైర్ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిపాలనలో ప్రజలకు జవాబుదారీతనంగా, పారదర్శకతగా, అవినీతికి తావు లేకుండా చేయాలని వెంకటరెడ్డి సూచించారు.

ఈనెల 6 నుండి 8 వరకు కరీంనగర్ లో జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు  విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మచ్చ రమేష్, బాకం ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.