24 July, 2026 | 7:10 PM

ఆస్తి వివాదంతోనే కాల్పులు

24-07-2026 06:31 PM

మెట్ పల్లి డిఎస్పీ రాములు 

మెట్ పల్లి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు ఆస్తి వివాదమే కారణమని మెట్ పల్లి డిఎస్పి రాములు తెలిపారు. శుక్రవారం స్థానిక సిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సొంత అన్న భార్యపై ఆస్తి వివాదాల నేపథ్యంలో ముందస్తు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. మెట్‌పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్ అలియాస్ జేసీబీ శంకర్, గోనెల రాజం సొంత అన్నదమ్ములు. గోనెల శంకర్, అతని భార్య గోనెల అనూష, కుటుంబ సభ్యులకు తెలియకుండా గోదూర్ రోడ్డులో ఉన్న సుమారు యాభై ఎనిమిది గుంటల వ్యవసాయ భూమిని విక్రయించడంతో పాటు నివాస గృహాన్ని కూడా అనూష పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఈ విషయమై రాజం మరియు అతని భార్య గోనెల లక్ష్మి తమ వాటా కోరుతూ ప్రశ్నించడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.ఈ ఆస్తి వివాదాల నేపథ్యంలో 2020లో ఒకసారి, 2023లో మరోసారి లక్ష్మి మరియు ఆమె భర్తపై కర్రలతో దాడి చేసి ప్రాణహాని బెదిరింపులకు పాల్పడగా, ఆ రెండు సందర్భాల్లోనూ మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. లక్ష్మి అడ్డుగా ఉంటే ఆస్తి మొత్తం తమ అధీనంలోకి రాదనే ఉద్దేశ్యంతో ఆమెను హత్య చేయాలని ఆస్తి వివాదాన్ని శాశ్వతంగా ముగించేందుకు గోనెల శంకర్ అతని భార్య అనూష మరియు వారి బంధువు గోపి ముత్తయ్య తమ వద్ద జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన సచిన్ కుమార్ అలియాస్ సచిన్ వర్మ ను  సంప్రదించారు.

సచిన్ లక్ష్మిని హత్య చేస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని నిందితులు చెప్పడంతో పథకం ప్రకారం సచిన్ వర్మ మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడ నాటు పిస్టల్ ను కొనుగోలు చేసి తీసుకొచ్చి గోనెల శంకర్‌కు అప్పగించాడు. వేసవి కాలంలో గోనెల లక్ష్మి మరియు ఆమె భర్త ఇంటి ముందు వరండాలో నిద్రించే అలవాటు ఉండటంతో సచిన్ వర్మ గత నెల 15 న అర్ధరాత్రి ముఖానికి రుమాలు కట్టుకొని తన మోటార్ సైకిల్‌పై లక్ష్మి ఇంటికి వెళ్లి వరండాలో నిద్రిస్తున్న గోనెల లక్ష్మిపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ లక్ష్యాన్ని తప్పి బాధితురాలి ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడి నుండి పరారయ్యాడు.

కాల్పుల అనంతరం నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సచిన్ వర్మ ను వెంటనే ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ కేసులో ప్రధాన కుట్రదారులతో పాటు మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, హత్యాయత్నానికి ఉపయోగించిన నాటు పిస్టల్, రెండు సజీవ కార్ట్రిడ్జీలు,బుల్లెట్స్, ఒక మోటార్ సైకిల్ మరియు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు.అంతర్రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసి కేసును విజయవంతంగా ఛేదించిన మెట్‌పల్లి సీఐ బి.సురేష్ బాబు, ఎస్‌ఐ పి. కిరణ్ కుమార్ మరియు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.