15-11-2025 12:41:44 AM
గద్వాల,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఉపన్యాస పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థి కేశవర్ధన్ ప్రథమ బహుమతి సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. టీ- శాట్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ( TSGHMA) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలలో మల్దకల్ మండలం అమరవాయి గ్రామ జెడ్పిహెచ్ఎస్ పదవ తరగతి విద్యార్థి కేశవర్ధన్ ప్రథమ బహుమతి సాధించటం జరిగింది.
ఈ ఉపన్యాస పోటీల్లో 33 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనగా, టీ-శాట్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో కేశవర్ధన్ అద్భుతమైన వాగ్దాటితో, అనర్గళంగా ప్రసంగించి జోగులాంబ గద్వాల జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో వినిపించేలా చేశారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్రవారం తన ఛాంబర్ లో విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్, గైడ్ ఉపాధ్యాయురాలు అనిత, తదితరులు పాల్గొన్నారు.