నేడు ఇండియా కూటమి కీలక భేటీ
- పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సమావేశం
- హాజరుకానున్న 23 పార్టీల నేతలు
న్యూఢిల్లీ, జూన్ ౭: వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి కీలక సమావేశం జరుగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో పాటు కూటమి నుంచి డీఎంకే వైదొలిగిన తర్వాత నిర్వహించే తొలి సమావేశం కావడంతో రాజకీయాల పరంగా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సమావేశానికి 23 పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
అయితే.. తమిళనాడులో ఇటీవల అధికార పగ్గాలు చేపట్టిన టీవీకే నుంచి సమావేశానికి ఎవరు హాజరవుతారనే ఆసక్తి మొదలైంది. అలాగే, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యా నించారు. దీనిపై సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు లేఖ కూడా రాశారు.
అయినప్పటికీ ఈ సమావేశానికి హాజరవుతామని సీపీఎం తెలిపింది. ఫరూక్ అబ్దు ల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఈ భేటీకి వస్తున్నట్లు ప్రకటించింది. గతంలో పార్లమెంట్‌లో ఆమోదం పొందని ౨ రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రభుత్వం మళ్లీ తీసుకువచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యం లో విపక్షాల నేతలు ఆయా బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.






