కాలుష్య వ్యర్థ రసాయన జలాలతో చేపల మృత్యువాత
ఘట్ కేసర్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పాటు నగరంలోని పలు డంపింగ్ యార్డుల నుండి వెలువడే కాలుష్య వర్ధ్య రసాయన జలాలు ఘట్ కేసర్ ఎరుమల్లె వాగు ద్వారా ఎదులాబాద్ లక్ష్మినారాయణ చెరువులోకి చేరుకుంటున్నాయి. దీంతో చెరువులోని జలాలు విషపూరితమై అందులోని దాదాపు రూ.5 లక్షలకు పైగా విలువ గల చేపలు మృత్యువాత పడ్డాయి. మృతి చెంది చెరువు ఒడ్డుకుని చెరుకోవటాన్ని చూసిన మత్స్యకారుల కుటుంబాలు అందోళన చెందుతున్నారు.
గత రెండు రోజులుగా విషపూరిత వ్యర్థ జలాలు చెరువులోకి చేరుకుంటుండటంతో చేపలు మృత్యువాత పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదులాబాద్ లక్ష్మినారాయణ చెరువు దాదాపు 700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ చెరువుపై 350 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో విషపూరిత వర్ధ్య జలాల కారణంగా చేపలు మృత్యువాత పడ్డ విషయం తెలుసుకున్న జిల్లా మత్స్య శాఖ అధికారి ఎ. సుకీర్తి సోమవారం పరిశీలించారు.
చేపల మృతి నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేధికను అందజేయనున్నట్లు చెప్పారు. చేపల మృతిపై మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. చేపల మృత్యువాతకు కారణమైన వర్థ్య జలాలు చెరువులో ఎంత శాతం ఉన్నాయని, వాటి విషతుల్యం ఎంత వరకు ఉంటుందని తెలుసుకునేందుకు నీటి నమూనాను ప్రయోగశాలకు పంపించి పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు.






