ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మం, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లు జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తు లను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన పి. కావ్య తనకు కల్లూరు సాంఘిక సంక్షేమ గురుకులంలో 7వ తరగతి సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఆర్.సి.ఓ. కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ, లింగం బంజర గ్రామస్థులు గ్రామంలో గతం నుంచి ఉన్న రోడ్డును ట్రాక్టర్ ద్వారా దున్ని చెడగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, రోడ్డును తిరిగి ప్రజా ప్రయోజనార్ధం నిర్మించి అప్పగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం పార్శీబంధంకు చెందిన షేక్ ఆసియా తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం అర్భన్ మండలం వెలుగుమట్ల గ్రామానికి చెందిన జి. సత్యనారాయణ పుట్టకోట చెరువు 50 ఎకరాల పాటు ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ చెరువు సుందరీకరణ, ఆధునీకరణ పనులు చేపట్టాలని దరఖాస్తు చేయగా కలెక్టరేట్ ఈ విభాగం సూపరింటెండెంట్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






