calender_icon.png 12 October, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారంలో చేప పిల్లలు చెరువుల్లోకి

12-10-2025 04:03:15 AM

సీఎం రేవంత్‌రెడ్డిచే కార్యక్రమ నిర్వహణ 

మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని చెరువుల్లో చేపపిల్లలు వదలడంపై మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ వారం రోజు ల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. అందు కు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి రూ.122 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని మంత్రి గుర్తు చేశారు.

తెలంగాణలోని కృష్ణ, గోదావరి నదులతో పాటు గొలుసుకట్టు చెరువులు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ నుంచి చేపపిల్లల పంపిణీ జరిగేలా ఉత్పత్తి చేయాలని, ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని పనిచేయాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చేప పిల్లలను వదలడంలో అక్రమాలు జరిగాయి. ఆ విధంగా జరగకుండా చూసుకోవాలని ఎక్కడైనా అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. తాను 32 జిల్లాల్లో ఉన్న చెరువులను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నాను.

అందుకు కావాల్సిన రూట్ మ్యాప్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.  ఈ సందర్భంగా అధికారులు 2024-- 25లో 4.77 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అయ్యాయని, వీటి విలువ రూ.7,460కోట్లు అని మంత్రికి తెలిపారు.ప్రస్తుత 2025- -26లో 3.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, సహజ ఉత్పత్తి నుంచి1.98 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చని అంచనా వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్,డైరెక్టర్ నిఖిల, డీఎఫ్‌ఓలు పాల్గొన్నారు