13 May, 2026 | 10:14 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను అధిగమించాలి

13-05-2026 08:53 PM

నిర్వహణ లోపంతో ఓపీఎంఎస్ లో తీవ్ర జాప్యం

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను అధిగమించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రవాణా నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థలపై బుధవారం కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.

అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద నిరంతరం అందుబాటులో ఉండాలని, కొనుగోలు, రవాణా ప్రక్రియలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుల నుంచి ఎటువంటి అదనపు వసూళ్లు జరగకుండా చూడాలని, అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ట్యాబ్ ఎంట్రీలు, రిజిస్టర్ల నిర్వహణ లేకపోవడం, మిల్లులను కేటాయించకపోవడం వంటి సమస్యలతో ఓపిఎంఎస్ లో తీవ్ర జాప్యం జరిగి రైతులకు సకాలంలో డబ్బులు రావడం లేదన్నారు.

కొన్ని మిల్లులకే అధిక కేటాయింపులు చేస్తూ, మిగిలిన మిల్లులకు సరైన కేటాయింపులు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ లోపాలను అధిగమించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలోనూ అవకతవకలకు చోటు లేకుండా పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నిరంతరం కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి స్వామి కుమార్, మేనేజర్ విమల, డీఏవో వీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.