15 July, 2026 | 12:40 AM

ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రాంతీయ డైరెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

15-07-2026 12:00 AM

ఘట్ కేసర్, జూలై 14 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం సోషల్ లెర్నింగ్ అసోసియేట్ డైరెక్టర్, ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేష్ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ డైరెక్టరేట్, హైదరాబాద్ కార్యాలయాన్ని సందర్శించి, నూతనంగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సైదా రామావత్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈసంద ర్భంగా అనురాగ్ విశ్వవిద్యాలయం యాజమాన్యం, ఎన్‌ఎస్‌ఎస్ సెల్ తరపున డాక్టర్ సి. మల్లేష్ సైదా రామావత్ కి అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం శాలువా కప్పి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఒక మొక్కను, పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. ఈసమావేశంలో విద్యార్థుల్లో సామాజిక సేవా భావన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, జాతీయ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.

అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినూత్న సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు మరియు విద్యార్థుల నాయకత్వ వికాసానికి చేపడుతున్న కార్యక్రమాల గురించి డాక్టర్ సి. మల్లేష్ వివరించారు. భవిష్యత్తులో ఎన్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ డైరెక్టరేట్తో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని తెలిపారు. సైదా రామావత్ అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, సమాజాభివృద్ధికి దోహదపడే నాణ్యమైన ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల నిర్వహణకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.