17 June, 2026 | 4:04 AM

వరద సమస్యలు రావొద్దు

17-06-2026 03:05 AM
  1. ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలి 
  2. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జోనల్ కమిషనర్ వికాస్ మహాతో 

ఎల్బీనగర్, జూన్ 16 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో రానున్న వర్షాకాలంలో ముం పు ప్రాంతాల్లో వరద సమస్యలు రావొద్దని, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ఆదేశించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీనగర్ లోని రెయిన్‌బో ఆసుపత్రి, చింతల కుంటలో ఉన్న కేఎల్‌ఎం షాపింగ్ మాల్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై, మన్సూరాబాద్ డివిజన్ లోని గణేశ్ నగర్, హయత్ నగర్ డివిజన్ లోని పుల్లారెడ్డి స్వీట్స్ షాపు, వీరభద్ర కాలనీ, పెద్ద అంబర్ పేట లోని జాతీయ రహదారిపై ఉన్న వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేసి, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో సులభమైన ట్రాఫిక్ రాకపోకలకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చే యాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.

వర్షాకాలానికి ముందే నాలాల పూడిక పనులు పూర్తి చేయాలి ః ఆగమయ్య, హకీమాబాద్ కాలనీల్లో అధికారులతో కలిసి పరిశీలించిన కొప్పుల నర్సింహారెడ్డి 

నాగోల్, జూన్ 16 (విజయక్రాంతి): రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మన్సూరాబాద్ డివిజన్లోని ఆగమయ్య, హకీమాబాద్ కాలనీలు, పెద్ద చెరువులోకి వచ్చే ప్రధాన నాలాల పూడిక పనులను ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో (ఐఏఎస్), హైడ్రా, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులతో కలిసి మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగమయ్య, హకీమాబాద్ ప్రాంతాల్లోని ప్రధాన నాలాల పూడిక పనులను సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరగా పూర్తి చేస్తే డ్రైనేజీలు పొంగిపొర్లే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే వనస్థలిపురం, సాహెబ్నగర్ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని మన్సూరాబాద్ పెద్ద చెరువు, చిన్న చెరువుల్లోకి మళ్లించడం ద్వారా 50కి పైగా కాలనీల భూగర్భ జలాలు పెరిగి, వేసవిలో నీటి సమస్య తగ్గే అవకాశం ఉందన్నారు.