ఉత్తరాదిని ముంచెత్తిన వరదలు
- హర్యానా, పంజాబ్‌లో భారీ వర్షాలు
- యమునా నది ఉగ్రరూపం
- ఢిల్లీ శివారు ప్రాంతాలపై ప్రభావం
- హత్నికుండ్ బరాజ్ వద్ద పురాతన వంతెన మూసివేత
- కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
- నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు
- ముంపు ప్రాంతాల్లో పంజాబ్, ఉత్తరాఖండ్ సీఎంల పర్యటన
- వరద బాధితుల కష్టాలు విని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ భావోద్వేగం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు తోడు ట్రాఫిక్ సమస్య పట్టిపీడిస్తోంది. యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ వద్ద ఉన్న పురాతన స్టీల్ వంతెనను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. వాహనదారులు, పాదచారులు వంతె నపై నుంచి ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని నిషేధాజ్ఞలు విధించారు.
గత వారం నుంచి సంభవించిన వరదలకు పంజాబ్ వ్యాప్తంగా 30 మంది పౌరులు మరణించారని సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జనజీవనం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఢిల్లీ లో భారీ వరదలు సంభవించే అవకాశం ఉం దని హెచ్చరికలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇండ్లు ఖాళీ చేసిన వారందరూ సహాయక శిబిరాలను వినియోగించుకోవాలంది. పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యం లో పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు మం జూరు చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. హిమానీనదాలు కరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షానికి ఢిల్లీ సహా నోయిడా, గురుగ్రామ్‌లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీం తో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అధికార పార్టీలపై మాటల దాడి చేశాయి. జమ్మూకశ్మీర్‌లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రా ల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
పలు రాష్ట్రాలకు హెచ్చరికలు
ఐఎండీ ఉత్తరాదిలోని రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. హర్యానా, పం జాబ్, హిమాచల్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఆ రెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబో యే గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
మరీ ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిలిబిత్, లఖింపూర్, షాజహాన్‌పూర్, ఘజియాబాద్, నోయిడా జిల్లా లు, హర్యానాలోని ఫతేబాద్, జింద్, హిసార్, గురుగ్రామ్, రేవారి, మేవాట్ జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని లాహుల్-స్పితి, కాంగ్రా, కుల్లు జిల్లాలు, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, కపుర్తలా, మోఘా, బర్నాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 15 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవనుందని హెచ్చరించింది.
ఇక తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, ఉత్తర చత్తీస్‌ఘడ్, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గంటలకు 5-15 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
రాబోయే 24 గంటలూ ఇంతే..
రాబోయే 24 గంటల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు కొనసాగనున్నట్టు ఐఎండీ తెలిపింది. మత్య్సకారులు చేపల వేట కోసం బంగాళాఖాతంలోకి వెళ్లొద్దని సూచించింది. హిమానీనద సరస్సులు కరిగే అవకా శం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అలర్ట్ జారీ చేసింది. లడఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ మొదలయిన రాష్ట్రాల్లో హిమానీనద సరస్సులు ఉన్నాయి. ఈ సరస్సులపై పర్యవేక్షణ అవసరం అని సీడబ్ల్యూసీ పేర్కొంది.
పాక్‌ను హెచ్చరించిన భారత్
భారీ వర్షాల వల్ల తీవ్రంగా వరదలు సంభవించే అవకాశం ఉందని భారత్ పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఇటీవలే తావి నదీకి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పాక్‌ను హెచ్చరించిన భారత్ మంగళవారం మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలోని వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
యమునాపై ఉన్న పురాతన వంతెన మూసివేత
ఢిల్లీ శివారులోని యమునా నదిపై ఉన్న పురాతన స్టీల్ వంతెనను అధికారులు తాత్కాలికలంగా మూసేశారు. నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో అధికారులు బ్రిడ్జిని మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వాహనదారులు, పాదచారులు ఎవరూ ఈ వంతెనపై నుంచి రాకపోకలు సాగించేందుకు వీలులేదని అధికారులు పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ వరద హెచ్చరికలు చేసిన అనంతరం అధికారులు ఈ వంతెనను మూసేశారు. ఇందుకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
కన్నీళ్లు పెట్టుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పర్యటించారు. బాధితులు చెప్పేది ఓపికగా విన్నారు. ఈ సందర్భంలో ఓ బాధితురాలు చెప్పిన ఆవేదనతో ఆయన కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. అందరికీ అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడొద్దని హామీనిచ్చారు. పంజాబ్‌లో పోటెత్తిన వరదల్లో వారం రోజుల్లోనే 30 మంది మృతి చెందారని, వేలాది మంది ఇండ్లు కోల్పోయారని భగవంత్ మాన్ తెలిపారు. యావత్ భారతదేశం పంజాబ్‌కు అండగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐఎండీ అలర్ట్ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది.




