11 July, 2026 | 1:37 AM

జీపీల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి

11-07-2026 12:00 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 10 (విజయక్రాంతి): గ్రామపంచాయతీలలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ హ రిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్ స్వచ్ఛభారత్ మిషన్ స్టేట్ మోడల్ అధికారి శ్రీధర్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు, సర్పంచ్ లకు గ్రామ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్ లు తమ గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామపంచాయతీలలో పగటిపూట వీధి దీపాలు వెలగకుండా నియంత్రికలు బిగించి విద్యుత్ ఆదా చేయాలని, గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు పడవేయకూడదని, భారీ వర్షాల సమయంలో మురికి కాలువలలో చేరి మురుగునీటి ప్రవాహానికి అడ్డుపడి మురుగునీరు నివాసాలలోకి చేరుతుందని తెలిపారు.

ప్రతిరోజు మురుగు కాలువలు శుభ్రం చేయాలని, పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. తద్వారా వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నియంత్రించవచ్చని తెలిపారు. గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, నీరు నిలవ ఉండే చోట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. పాఠశాలలలో మూత్రశాలలు, అదనపు గదుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని, సెలవు దినాలలో నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారని, అట్టి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, మిషన్ భగీరథ ఎస్.ఈ. సిద్దిక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.