11 July, 2026 | 1:19 AM

రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి

11-07-2026 12:00 AM
  1. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటు
  2. యంగ్ ఇండియా, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర 
  3. పెండింగ్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
  4. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రుల నివాసాల ముట్టడి
  5. విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన రెండేళ్లు పూర్తవుతున్నా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని నినదించారు. యంగ్ ఇండియా, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు.

సుమారు రూ.10,814 కోట్ల పెండింగ్ స్కాలర్‌షిపులు, -ఫీజు రీయింబర్స్‌మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఎఐడీఎస్‌ఓ, ఎఐఎఫ్డీఎస్, ఎఐఎస్బీ, ఎఐపీఎస్‌యూ సంఘాల పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా విద్యాసంస్థలు బంద్‌ను పాటించాయని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర మంత్రుల నివాస సముదాయాన్ని, ప్రజాభవన్‌ను విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు ముట్టడికి యత్నించగా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.

పలువురు విద్యార్థులపై పోలీసులు పిడిగుద్దులతో దాడి చేసి బలవంతంగా అరెస్టు చేశారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల పరిష్కారం కోరుతున్న విద్యార్థులపై నిర్బంధం ప్రయోగించడం ప్రభుత్వ అప్రజాస్వామ్య వైఖరికి నిదర్శనమని ఆగ్రహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి సంఘాల నాయకులు టీ నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి), పుట్టా లక్ష్మణ్ (ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి), ఎస్ అనిల్ (పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి), పీ మహేష్, పొడపంగి నాగరాజు (పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి), నితీష్ (ఎఐడీఎస్‌ఓ రాష్ట్ర సహాయ కార్యదర్శి), పల్లె మురళి (ఎఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు), నవీద్ హాకిమ్ (ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి), గోపాల్ (ఎఐపీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు) మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించకపోవడం విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తోందన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. 

రీయింబర్స్‌మెంటేది..?

విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆరేళ్ల నుంచి సుమారు రూ.10,814 కోట్లు విడుదలచేయకుండా వేలాది మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తోంద న్నారు. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నప్పటికీ వాటిని నియంత్రిం చేందుకు ప్రభుత్వం ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాకపోవడం వల్ల విద్య వ్యాపారంగా మారిపోయిందని విమర్శించారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం వంటి కనీస సౌకర్యాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విద్య బలోపేతంపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు దామెర కిరణ్, కే అశోక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, జే రమేష్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెహమాన్, హైదరాబాద్ జిల్లా నాయకులు చైతన్య, అనిల్, హరీష్, పీడీఎస్‌యూ నాయకులు హరీష్, శ్యామ్ పాల్గొన్నారు.