గ్రామానికో 50 ఎకరాలు!
- ప్రత్యామ్నాయ పంటల సాగుకు సన్నద్ధం
- కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు
మహబూబాబాద్, జులై 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో కనీసం 50 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 482 గ్రామాలు ఉండగా కనీసం 25 ఎకరాల్లో ఆయిల్ పామ్, మరో 25 ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూల ఉత్పత్తిని ఇచ్చే పంటల సాగును చేపట్టే విధంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
పంట మార్పిడి నీ పాటించాలి
ప్రతి గ్రామంలో బోర్లు, బావులు కింద 50 ఎకరాలలో ఆదాయం ఇచ్చి మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్, కూరగాయలు పండ్లు పూలు, మల్బరీ, ఉల్లి, నూనె గింజలు, చిరుధాన్యాలు, మొదలైనవి సాగు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
నానో యూరియా వాడాలి
స్వయం సహాయ సంఘాల ద్వారా డ్రోన్స్, సౌర విద్యుత్ కంచె, కూరగాయల సాగు ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు. తక్కువ నీరు, ఆధునిక పద్దతులైన ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ట్రెల్లీస్, పందిరి సాగు, సేంద్రీయ సాగు వంటి పద్దతులను పాటించేందుకు ప్రత్యేకంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న కురవి, చిన్నగూడుర్, నర్సింహులపేట, దంతాలపల్లి, నెల్లికుదురు మండలాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నిర్వహించి, పలు క్షేత్రాలు సందర్శించి, రైతులకు పంట మార్పిడిపై అవగాహన చేశారు.
ప్రజలు రోజు వారీగా తినే కూరగాయలను ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు వివరించారు..
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీదేవి, మండల వ్యవసాయ అధికారి, గంధం. వినయ, నరసింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారులు డి.మౌనిక, కళ్యాణి, శరత్ చంద్ర, టీజీ ఆయిల్ ఫెడ్ అధికారులు అనిల్ ,రామ్, రంజిత్ , నీరజ, రైతులు, ఆదర్శ రైతులు పోషాల శ్రీనివాస్ , అలవాల నవీన్,మందుల యాకోబు పాల్గొన్నారు.






