13 May, 2026 | 2:18 AM

సభ్యత్వంపై దృష్టి

13-05-2026 01:29 AM
  1. డిజిటలైజేషన్‌లో నమోదుకు బీఆర్‌ఎస్ నిర్ణయం
  2. పోలింగ్ బూత్‌కు ఇద్దరు చొప్పున కార్యకర్తలకు శిక్షణ 
  3. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త 
  4. జిల్లాలవారీగా ఇన్‌చార్జిలను నియమించిన అధినేత కేసీఆర్
  5. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆరు గంటలు సాగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం 
  6. పలు అంశాలపై పార్టీ కీలక నిర్ణయాలు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదుపై భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం మంగళవారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో సుదీర్ఘంగా జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి  నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం, ఓటరు జాబితా సవరణ, పార్టీ మరింత బలోపేతానికి తీసుకునే అంశాలపై చర్చించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్   చేపట్టిన సర్‌తో పాటు, ఓటరు లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నందున, పార్టీ సభ్యత్వం కూడా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించా రు. ప్రతీ నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయ కర్తను నియమించాలని,  ప్రతీ మండలానికి, మున్సిపల్ వార్డుల వారీగా సమన్వయ కమిటీలను రెండు మూడు రోజుల్లో నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అంతే కాకుండా డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున, రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో, బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని,  డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాల పై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది. పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్ధ్దతిలో చేపట్టేందుకు తగిన శిక్షణ శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని  నిర్ణయం జరిగింది. పార్టీ సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. 

జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లు

ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు   -  ఖమ్మం, కొత్తగూడెం

మాజీ మంత్రి  జీవన్‌రెడి              -      జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల 

మాజీ  సత్యవతి రాథోడ్               -    ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి               -    జనగాం, హనుమకొండ, వరంగల్ 

గ్యాదరి బాలమల్లు                     -      మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట 

మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్             -     నిజామాబాద్, కామారెడ్డి 

మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు    -     మంచిర్యాల, ఆసిఫాబాద్ 

 రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి             -    ఆదిలాబాద్, నిర్మల్ 

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి   -      వికారాబాద్, రంగారెడ్డి 

మాజీ మంత్రి  మహమూద్ అలీ  -       మహబూబ్‌నగర్, నారాయణపేట 

మెట్టు శ్రీనివాస్                 -        గద్వాల్, నాగర్కర్నూల్, వనపర్తి 

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి   -      మేడ్చల్ -మల్కాజిగిరి, యాదాద్రి 

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్    -  హైదరాబాద్ 

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్             -    నల్గొండ, సూర్యాపేట