30 May, 2026 | 2:39 AM

సంస్థాగత బలోపేతంపై నజర్!

30-05-2026 12:26 AM
  1. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం 
  2. బూత్ స్థాయి నుంచి బలోపేతంపై దృష్టి 
  3. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై అంతర్మథనం 
  4. జిల్లాలో నాయకుల మధ్య వర్గ పోరు 

మేడ్చల్, మే 29(విజయ క్రాంతి): బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్తిస్థాయి కార్యవర్గం నియమించిన అధిష్టానం బూత్ లెవల్ కమిటీలు కమిటీలు, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ఇన్చార్జిని కూడా నియమించింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలు జరిగాయి.

మిగతా నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్టానం చర్యలు చేపట్టింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉంది. కూకట్పల్లి, కుతుబుల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు మేడ్చల్ లోని కొంత భాగం శేరిలింగంపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉండగా, మేడ్చల్  లోని మిగతా భాగం, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలు మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది.

మూడు మున్సిపాలిటీలలో ఒకటి మాత్రమే కైవసం చేసుకుంది. అది కూడా బిజెపి మద్దతుతో గట్టెక్కింది. మిగతా రెండు మున్సిపాలిటీలు బి.ఆర్.ఎస్ ఖాతాలోకి వెళ్ళాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బి ఆర్ ఎస్ గెలుపొందడం తో కార్పోరేషన్ ఎన్నికల దృష్ట్యా అధిష్టానం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినందున వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ గెలుపొందాలని ఆ పార్టీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. 

త్వరలో బూత్, డివిజన్ కమిటీలు 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లడం లేదని అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. జిల్లా నాయకుల సైతం అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు రాష్ట్రస్థాయి పెద్దలు భావిస్తున్నారు.బూత్, డివిజన్ కమిటీలు లేనందున సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలన్ని ప్రభుత్వం కార్పొరేషన్లలో విలీనం చేసింది. మున్సిపాలిటీల స్థానంలో సర్కిల్, డివిజన్ లు ఏర్పడ్డాయి. డివిజన్లకు కాంగ్రెస్ కమిటీలు లేవు. బూతు స్థాయి లో చురుకైన కార్యకర్తలను, డివిజన్లకు సీనియర్ నాయకులను నియమించాలని అధిష్టానం భావిస్తోంది. బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకం కావడంతో వీరికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు.

బూత్ లెవెల్ ఏజెంట్ నియామకాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డివిజన్ అధ్యక్షులు నియామకాల ను అధిష్టానం చేపట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకుంటే వారికి అనుకూలమైన వారి పేర్లు ఇస్తారని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి మొండి చేయి చూపుతారని అంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందాలంటే డివిజన్ అధ్యక్షులుగా సమర్థవంతమైన వారిని నియమించాల్సిన అవసరం ఉందని, తమ అనుయాయులకు పదవులు కట్టబెడితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని అంటున్నారు. 

జిల్లాలో నాయకుల మధ్య వర్గ పోరు 

జిల్లాలో నాయకుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. మేడ్చల్ నియోజకవర్గం లో వర్గ పోరు వల్లే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. అధిష్టానానికి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. డిసిసి అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హరి వర్ధన్ రెడ్డి వర్గాలు ఉన్నాయి. కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో ఇన్చార్జి కొలను హనుమంత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, భూపతిరెడ్డి నర్సారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గంలో బండి రమేష్, శ్రీరంగం సత్యం, ఉప్పల్ నియోజకవర్గంలో పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి ఎవరికివారుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు ఎవరూ లేరు.

జిల్లాకు మంత్రి,ఎంపీ, ఎమ్మెల్యేలు లేకపోవడం మైనస్ గా మారింది. దీంతో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు తయారైంది. మైనంపల్లి హనుమంతరావు సీనియర్ నాయకుడు అయినప్పటికీ జిల్లా రాజకీయాలలో తల దూర్చడం లేదు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో సైతం ఎక్కువగా పర్యటించడం లేదు. నాయకుల మధ్య సమన్వయం కుదురుచడానికి అధిష్టానం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.