18 July, 2026 | 4:12 PM

జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం

18-07-2026 04:12 PM

ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): ఢిల్లీ ఎన్.సి.ఆర్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలో గల గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ వేదికగా ఈ నెల జూలై 12 నుండి 14 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హెచ్.సి.ఎల్ (HCL) ఫౌండేషన్ స్పోర్ట్స్ ఫర్ చేంజ్ నేషన్ ఫైనల్స్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, మన ప్రాంతానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. ఈ జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో సర్వజ్ఞ పాఠశాల విద్యార్థి ఎస్.కె. సాహిల్ ఫజల్ అసాధారణమైన ఆటతీరుతో రాణించి టేబుల్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

అదేవిధంగా, పాఠశాలకే చెందిన మరో విద్యార్థి ఇ. హరి జాతీయ స్థాయి పోటీల్లో చురుగ్గా పాల్గొని తన ప్రతిభను చాటుకుంటూ ప్రశంసా పత్రం అందుకున్నారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను సర్వజ్ఞ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ ఆర్.వి. నాగేంద్ర కుమార్ మరియు డైరెక్టర్ శ్రీమతి కె. నీలిమ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ ఆర్.వి. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, "మా విద్యార్థులు జాతీయ స్థాయి వేదికపై ప్రతిభ చాటి పతకాలు సాధించడం ఎంతో గర్వకారణం.

కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించేలా సర్వజ్ఞ స్కూల్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో ఈ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము," అని తెలిపారు. డైరెక్టర్ శ్రీమతి కె. నీలిమ మాట్లాడుతూ, విద్యార్థుల పట్టుదల, క్రీడా శిక్షకుల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. విజేతలుగా నిలిచిన సాహిల్ ఫజల్, హరిలను ప్రిన్సిపాల్స్, పి.ఇ.టి, పాఠశాల అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు ఘనంగా అభినందించారు.