ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్
ముకరంపుర,(విజయక్రాంతి): రామడుగు మండల కేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంను సీపీఎం మండల నాయకత్వంతో కలిసి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్ శనివారం సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నరేష్ పటేల్ మాట్లాడుతూ, రామడుగు, కొత్తపల్లి ఆరోగ్య కేంద్రాలకు ఒకే వైద్యాధికారి విధులు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఒకే వైద్యాధికారి రెండు ఆరోగ్య కేంద్రాల బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో రామడుగు ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని తెలిపారు. రామడుగు మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే వెంటనే ఈ ఆరోగ్య కేంద్రానికి పూర్తి స్థాయి శాశ్వత వైద్యాధికారిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ప్రభాకర్ నాయకులు శేఖర్,రాజు,శ్రీనివాసులు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






