ఇంజినీరింగ్ విద్యలో స్కిల్స్‌పై దృష్టి!
- విద్యార్థులకు పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్
- త్వరలో ప్రిన్సిపాల్స్, డీన్లతో సమావేశం
- ఏఐసీటీఈ, యూజీసీ అధికారులకు ఆహ్వానం
- వెల్లడించిన ఉన్నత విద్యామండలి అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత లోపిస్తోంది. గతంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్ కాలేజీలు కనీస విద్యాప్రమాణాలు పాటించకుండా విద్యను అందిస్తుండటంతో విద్యార్థుల్లో నైపుణ్యత కొరవడింది. ఇంజినీరింగ్‌లో చేరి నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్లతో బయటికి వస్తున్నారు తప్పితే సరైన స్కిల్స్‌తో రావడంలేదు. దీంతో ఉపాధి అవకాశాలు లభించక ఇంజినీరింగ్ పట్టభద్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఉద్యోగాలు దొరికినా..అందులో ఎక్కువ రోజులు ఇమడలేక, సరైన స్కిల్స్ లేకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా చేసి వస్తున్నారు.
లేదా కంపెనీలే వారిని ఇంటికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యతపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రత్యేక దృష్టిసారించింది. ఈ విద్యాసంవత్సరంలో లక్ష మంది విద్యార్థులు బీటెక్‌లో చేరారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల్లో కోర్సుకు తగిన స్కిల్స్‌ను అందించేలా చర్యలు చేపట్టింది. పరిశ్రమలలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు కల్పించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం త్వరలో రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్, డీన్లతో ప్రత్యేక సమావేశాన్ని ఉన్నత విద్యామండలి నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి ఏఐసీటీఈ, యూజీసీ అధికారులను ఆహ్వానించింది.
పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్స్..
ఇటీవల ఢిల్లీలో యూజీసీ చైర్మన్ ప్రొ. జగదీశ్ కుమార్, ఏఐసీటీఈ చైర్మన్‌లను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్. లింబాంద్రి, సెక్రెటరీ ప్రొ.శ్రీరాం వెంకటేశ్, కలసి తెలంగాణలో ఉన్నత విద్యాభివృద్ధి గురించి వివరించారు. ప్రధానంగా రాష్ర్టంలోని వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ విషయాలపై వారికి వివరించారు. తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యలో పెరుగుతున్న అడ్మిషన్లను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కావల్సినటువంటి నాణ్యమైన విద్యను, నైపుణ్యాలను పెంపొందించడం, అలాగే ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్స్‌లను కల్పించేటువంటి విషయాల పట్ల చర్చించారు.
దేశంలోని అనేక పరిశ్రమలలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్స్ కల్పించడానికి కావలసిన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏఐసీటీఈ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ చైర్మన్, చీఫ్ కోర్డినేటింగ్ అధికారిని ఇంజనీరింగ్ కాలేజీల విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై నిర్వహించే సమావేశానికి రావాలని కోరడం జరిగింది.
గుర్తింపు లేని డిస్టెన్స్ సెంటర్లతో ఇబ్బందులు..
వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఓపెన్ యూనివర్సిటి స్టడీ సెంటర్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతో అందులో విద్యార్థులు అడ్మిషన్లు పొందటం వల్ల వారి సర్టిఫికేట్లకు గుర్తింపు లేకుండాపోతుందని యూజీసీ చైర్మన్ దృష్టికి తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు తీసుకెళ్లారు. దీంతో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలిపారు. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలోని సంబంధిత అధికారులను సైతం కలిసి తెలంగాణలో ఇప్పటికీ అప్రూవల్ పెండింగ్ ఉన్న లా కళాశాలల గురించి వివరించడం జరిగింది. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.






