వైసీపీ నేతపై వేధింపుల కేసు
విజయవాడ సీపీకి ముంబై నటి జెత్వాని ఫిర్యాదు
విజయవాడ, ఆగస్టు 30 (విజయక్రాంతి): వైసీపీ నేత, కొందరు పోలీసు అధికారులు తనపై వేధింపులకు పాల్పడ్డారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై సినీ నటి కాదంబరి జెత్వాని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన కేసు, అంతకుముందు పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై తాను ముంబైలో పెట్టిన కేసు వివరాలు, ఆధారాలను విజయవాడ సీపీకి ఆమె అందజేశారు.
అటు నటిపై వేధింపుల కేసులో నిజనిజాలు తేల్చేందుకు ఏసీపీ స్రవంతి రాయ్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. అలాగే సదరు నటిపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రముఖ పత్రికతోపాటు టీడీపీ నేత వర్ల రామయ్యపై పరువు నష్టం దావా వేశారు. వారికి లీగల్ నోటీసులు పంపించినట్లు సమాచారం.






