ఆ భూములకు పట్టాలిచ్చింది కాంగ్రెస్సే..
అంధుల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభత్వుం పేదవారిని ఒకలాగ, ధనవంతులను మరొకలాగా చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని అంధుల కాలనీలో అర్థ్ధరాత్రి 400 మంది పోలీసుల ఆధ్వర్యంలో అంధుల ఇళ్లను కూల్చివేయడం దారుణమని, వారు తమ ఇళ్లలోని సామగ్రిని తీసుకుంటామని బతిమిలాడిన సమయం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లోని అంధుల కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వమే 2007లో వారికి పట్టాలు ఇచ్చిందని.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్‌ఎస్ హయాంలో వారికి మిషన్ భగీరథ నీళ్లు, కరెంట్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నాలుగేళ్లపాటు పెన్షన్ డబ్బులు కూడబెట్టుకొని వారు అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వారు నిర్మించుకున్న ఇళ్ల స్థలాల్లో చెరువు లేదు, కుంట లేదు, కనీసం రూ.కోట్లు విలువ చేసే భూమి కూడా కాదు. అయినప్పటికీ ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కూల్చేసిందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.






