18 June, 2026 | 1:30 AM

ప్రత్యామ్నాయంపై దృష్టి!

18-06-2026 12:00 AM

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు పెరుగుతున్న వేళ జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం ప్రాధ్యాన్యం సంతరించుకుంది. ఫ్రాన్స్ వేదికగా ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించిన తాజా సదస్సులో ప్రాంతీయ యుద్ధాలతో పాటు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి, ఆర్థిక అసమానతలు, కృత్రిమమేధ వంటి కీలక అంశాలు ప్రధానంగా చర్చకు రావడం గమనార్హం.

గతేడాది కెనడాలో జరిగిన జీ7 సదస్సు లో ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచడం, ఉక్రెయిన్‌కు మద్దతు వంటి అంశాలపై సభ్య దేశాలు దృష్టిపెట్టిన విషయం విదితమే. అయితే, పశ్చిమాసియా సంక్షోభం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో తాజా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన అంశంగా మారినట్టు తెలుస్తున్నది.

ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు మద్దతు కొనసాగుతుందని ప్రకటించిన సభ్య దేశాలు.. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించడం ముదావహం. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ముగియడంతో ఇంధన సరఫరా మార్గాలను విస్తరించాలని నిర్ణయించడం, ఒకే ప్రాంతంపై అతిగా ఆధారపడటాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు అభిప్రాయపడటాన్ని ఈ సందర్భంగా అందరూ స్వాగతించాలి.

చైనాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఈ నేపథ్యంలోంచే చూడాలి. ప్రపంచ వాణి జ్యంపై చైనా ఆధిపత్యం పెరుగుతుండటం, ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన కీలక ఖనిజాలపై డ్రాగన్ పెత్తనం చెలాయిస్తుండటాన్ని జీ7 దేశాలు పరిగణనలోకి తీసుకున్నాయని చెప్పాలి. అదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో సమతుల్యతను కాపాడేందుకు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగడం అవసరమని చెప్పక తప్పదు.

కాగా, యావత్ ప్రపం చం మనుగడకు ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పు అంశానికి ఈ సదస్సు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.

ఇదే ఫ్రాన్స్ వేదికగా 2015లో జరిగిన ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ పాలనలోని అమెరికా ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు బయటకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ప్రపంచానికి పెద్దన్నగా తనకు తాను చెప్పుకొనే అమెరికా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల కూటమిగా కితాబిచ్చుకునే జీ7 దేశాలు విశ్వ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న సమస్యను విస్మరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.