18 June, 2026 | 1:26 AM

పెన్షనర్లకు ధరాఘాతం

18-06-2026 12:00 AM

ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో కోల్ మైన్స్ పెన్షనర్ల జీవితం మరింత కష్టంగా మారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగినా, కోల్ మైన్స్ పెన్షనర్లకు అందుతున్న పెన్షన్ మాత్రం సంవత్సరాలుగా పెద్దగా పెరగలేదు. చాలామంది పెన్షనర్లు నెలకు రూ. 1,000 నుంచి రూ.5,000 వరకు మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. ఈ మొత్తంతో ప్రస్తుత పరిస్థితుల్లో కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం అసాధ్యమే.

పెన్షనర్లలో ఎక్కువమంది వృద్ధాప్యంలో ఉన్నవారే. మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు నిరంతర వైద్యం అవసరం. మందుల ధరలు పెరగడంతో వారి నెలవారీ ఖర్చుల్లో అధిక భాగం వైద్యానికే వెళ్తోంది. చాలామంది అప్పులు చేసి చికిత్స చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెరుగుతూ ఉం టుంది. అయితే కోల్ మైన్స్ పెన్షనర్లకు అలాంటి వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

ఫలితంగా ద్రవ్యోల్బణం ప్రభావం పెన్షనర్లపైనే పడుతోంది. కనీస పెన్షన్‌ను గౌరవప్రద జీవనానికి సరిపడే స్థాయికి పెంచడం, ద్రవ్యోల్బణ సూచీతో అనుసంధానం చేయడం, వైద్య సదుపాయాలను విస్తరించడం అత్యవసరం. పెరుగుతున్న ధరల నేపథ్యంలో కోల్ పెన్షనర్లకు తక్షణ ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల నైతిక బాధ్యత. వారి జీవితం గౌరవప్రదంగా కొనసాగేలా పెన్షన్ సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

 ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్, 8686051752