24 March, 2026 | 5:10 AM

అక్షయపాత్రకు 8 ‘ఆహార’ వాహనాలు

24-03-2026 01:44 AM

అందజేసిన వాఘ్ బక్రీ టీ గ్రూప్ 

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): వాఘ్ బక్రీ టీ గ్రూప్‌నకు చెందిన సేవా విభాగం అయిన వాఘ్ బక్రీ ఫౌండేషన్, అక్షయపాత్ర ఫౌండేషన్‌తో భాగస్వా మ్యంగా 8 ప్రత్యేక ఆహార పంపిణీ వాహనాలను అందజేసింది. హైదరాబాద్‌లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలతో అమర్చబడి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను కాపాడుతూ, దూర ప్రాంతాల్లోని పాఠశాలలకు సమర్థవంతంగా భోజనాలను చేరవేయగలవు.

ఈ 8 వాహనాల విలువ రూ.99 లక్షలు. ఈ తాజా సహకారంతో అక్షయపాత్రకు వాఘ్ బక్రీ ఫౌండేషన్ అందించిన మొత్తం వాహనాల సంఖ్య 38కి చేరగా, దాదాపు రూ. 5 కోట్ల వ్యయం జరిగింది. ఈ వాహనాలు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వినియోగంలో ఉన్నాయి.

కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస్ ప్రభు, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాస్ దేశాయి, వాఘ్ బక్రీ బ్రాండ్ అంబాసడర్ సుమ కనకాల, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సత్య గౌర చంద్ర దాస ప్రభు మాట్లాడుతూ.. వాఘ్ బక్రీ ఫౌండేషన్ నిరంతర మద్దతు అందుతున్నందుకు తాము కృతజ్ఞులము అన్నారు. పరాస్ దేశాయి మాట్లాడుతూ.. అక్షయపాత్రతో మా భాగస్వామ్యాన్ని మరింత బలపరచడంలో మాకు గర్వంగా ఉన్నదన్నారు. సుమ కనకాల ప్రశంసిస్తూ, వాఘ్ బక్రీతో అనుబంధం కలగడం నాకు గౌరవంగా ఉంది అని చెప్పారు.