27 February, 2026 | 3:23 AM

మల్టీ స్టారర్‌తో సంక్రాంతికి..

27-02-2026 01:14 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’తో భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. వరుసగా తొమ్మిది సినిమాలతో విజయాలు అందుకున్న ఆయన.. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోలుగా నటించనున్నారు. అనిల్ రావిపూడి ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్ల తర్వాత వెంకటేశ్‌తో కలిసి చేస్తున్న ఐదో చిత్రం కావడం విశేషం.

గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా ‘పటాస్’ సినిమాను రూపొందించిన అనిల్ రావిపూడి ప్రేక్షకుల మెప్పు పొందారు. తాజా సినిమా కోసం వీరిద్దరూ రెండోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌గా, అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందించన్నురు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రకటించటంతో ఇప్పట్నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.