1 April, 2026 | 3:31 AM

మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

01-04-2026 01:16 AM

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నాలుగంతస్తుల భవనానికి తాళం వేసిన జీహెచ్‌ఎంసీ

రూ.1.59 కోట్ల పన్ను బకాయిలు

బల్దియా నోటీసులకు స్పందించని సంబంధీకులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 31 (విజయక్రాంతి): తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. హైదరా బాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని జయలలితకు నాలుగంతస్తుల భవనం ఉన్నది. అయితే 2017 నుంచి ఆస్తి పన్ను బకాయిలు ఎవరూ చెల్లించకపోవడంతో రూ.1.59 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో రూ.78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ కాగా రూ.81 లక్షలు వడ్డీ. అయితే వన్-టైమ్ సెటిల్మెంట్ పథకం కింద వర్తించే రాయితీలను లెక్కించిన తర్వాత, బాకీ ఉన్న పన్ను బకాయిలు రూ.82,91,822 చెల్లించాల్సి ఉంది.

జీహెచ్‌ఎంసీ అధికారులు గత నెలలోనే బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. మార్చి 31 వరకు మాత్రమే ఓటీఎస్ వర్తింపు ఉండటంతో జయలలిత సంబంధికులు ఎవరూ కూడా చెల్లించేందుకు ముందుకురాలేదు. దీంతో మున్సిపల్ చట్టం నిబంధనల ప్రకారం మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులు వెళ్లి ఆ భవనాన్ని సీజ్ చేశారు. నోటీసులను బేఖాతరు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంటిని సీజ్ చేసి, గేటుపై నోటీసులు అంటించినట్లు అధికారులు వెల్లడించారు. బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే తిరిగి సీజ్ ఎత్తివేస్తామని వారు స్పష్టం చేశారు. 1967లో జయలలిత ఈ భవనాన్ని రూ.50 వేలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

2015లో ఆస్తి మార్కెట్ విలువ ఐదు కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పటి నుంచి ఆమెకు హైదరాబాద్‌తో సన్నిహిత అనుబంధం ఉంది. ఒకప్పుడు ఏడెనిమిది రాష్ట్రాల పోలీసుల పహారా, వందలాది మంది అనుచరుల కోలాహలంతో కళకళలాడిన ముఖ్యమంత్రి భవనం.. ఇప్పుడు కనీసం ఆస్తి పన్ను కట్టేవారు లేక ఇలా సీజ్ కావడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా, విషాదంగా మారింది.