29 June, 2026 | 1:13 PM

జ్ఞానప్రదాతలకు మాజీ డిప్యూటీ మేయర్ సత్కారం

06-09-2025 12:00 AM

జవహర్ నగర్, సెప్టెంబరు 5 (విజయక్రాంతి) : సమాజంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవారే ఉపాధ్యాయులని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా  రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, మన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు ఉపాధ్యాయులనీ,  అందుకే మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ఉన్నత స్థానం గురువులకు కల్పించబడిందని కొనియాడారు. 

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆజమ్ మొద్దీన్ మాట్లాడుతూ, పాఠశాలలో ఏ సమస్య తలెత్తినా రెడ్డి శెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కరించేవారని గుర్తుచేశారు. విద్యార్థుల చదువు కోసం, పాఠశాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం అండగా నిలిచారని, ఆయన అందించిన సహాయసహకారాలు మరువలేనివన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల పక్షాన శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి శెట్టి మహేష్, ఎండి నహీం, గడ్డమీది విజయ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.