calender_icon.png 6 September, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ కాలువలో తండ్రీకొడుకుల గల్లంతు

06-09-2025 12:00:00 AM

సంఘటనపై తీవ్ర దిగ్వాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

వేములపల్లి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి):-  గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఊరేగింపుతో వచ్చిన నిమజ్జనోత్సవం లో ప్రమాదం సంభవించి  తండ్రి కొడుకులు గల్లంతయ్యారు . ఈ హృదయ విషాద సంఘటన శుక్రవారం వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ లో చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మాడుగులపల్లి మండలం  ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన పున్న సాంబయ్య (45), అతని కుమారుడు పున్న శివమణి(20) గ్రామస్తులు, వినాయక కమిటీ సభ్యులతో కలిసి వినాయకుని తీసుకొని నిమజ్జనానికి సాగర్ ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ వినాయకుడిని నిమజ్జనం చేశారు. అనంతరం స్నానం చేయడానికి కాలువలోకి దిగిన తండ్రి సాంబయ్య ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయారు.

కుమారుడు అతడిని రక్షించే ప్రయత్నం చేయగా, ఈ క్రమంలో తండ్రి, కుమారుడు నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు.  రెస్క్యూ టీం తో తండ్రి కొడుకుల కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కరువైన భద్రత ఏర్పాట్లు..

నిమజ్జన ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా కొంతమందిని మాత్రమే సిబ్బందిని నియమించారని తెలిపారు.  సరైన వేతనం ఇవ్వడం లేదని , భోజన సదుపాయం కూడా కల్పించడం లేదని అందుకే విధులకు రావడంలేదని గజఈతగాళ్ళు తెలిపారు. గజ ఈతగాళ్లు లేకపోవడం వల్లనే వారిని కాపాడలేకపోయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

అనాథగా మిగిలిన కూతురు..

ప్రమాదానికి గురైన సాంబయ్యకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు శివ ఐటిఐ చదువుతుండగా, కూతురు తుంగపాడు గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కూతురు చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. తండ్రి వంట మాస్టర్ గా పనిచేస్తూ జీవనం పోషిస్తున్నాడు. తండ్రి, అన్నా చనిపోవడంతో అమ్మాయి అనాదగా మిగిలిందని గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. 

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, డీఎస్‌పీ..

ప్రమాదం చోటు చేసుకున్న విషయం  తెలియగానే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ అమిత్ నారాయన్ డిఎస్పి రాజశేఖర్ రాజు ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. వినాయక నిమ్మజ్జన వేడుకల్లో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గల్లంతు అయిన వారి కోసం సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వీరు వెంట  సిఐ పి .ఎన్.డి ప్రసాద్, ఎస్త్స్ర వెంకటేశ్వర్లు ఎమ్మార్వో హేమలత తదితరులు ఉన్నారు.