16 July, 2026 | 10:58 AM

కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత

10-12-2024 12:01 PM

బెంగళూరు,(విజయక్రాంతి): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ(92) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణ మంగళవారం తెల్లవారుజామునా బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో వ్యవహరించారు. కర్ణాటకలోని మండ్య జిల్లా సోమనహళ్లిలో 1932 మే 1న మల్లయ్య కృష్ణ జన్మించారు. 1962లో తొలిసారి రాజకీయ ప్రవేశం చేసి మద్దూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది 30 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు.

 కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా 1999-2004 వరకు పనిచేసి, అదే సమయంలోనే బెంగళూరులో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశారు. 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతులు నిర్వర్తించి, యూపీఏ హయంలో 2009-20142 మధ్య విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 1989 నుంచి 1993 వరకు కర్ణాటక శాసన సభ స్వీకర్ గా, 1971 నుంచి 2014 వరకు పలుమార్లు లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్ఎం కృష్ణ 2017లో బీజేపీలో చేరారు. 2023లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.