16 July, 2026 | 10:43 AM

సందిగ్ధ సిరియా!

10-12-2024 12:47 AM

* రెబెల్స్‌ను ప్రజలు ఆమోదిస్తారా?

* తిరుగుబాటుదారులకు విదేశాలు మద్దతిస్తాయా!

* దేశంలో శాంతి నెలకొనేదెప్పుడు?

* అంతర్యుద్ధం ముగిసినట్టేనా?

* సిరియా పునర్నిర్మాణం ఎలా?

* పరిణామాలను గమనిస్తున్న అగ్రదేశాలు

డమాస్కస్, డిసెండర్ 9: హయత్ తహరీర్ అల్ షామ(హెచ్‌టీఎస్) తిరుగుబాటు చేయడంతో ఈ నెల 8న దాదాపు 54 సంవత్సరాల అసద్ కుటుంబ కుటంబ వంశ పాలనకు సిరియాలో తెరపడింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్.. సిరియా మిత్ర దేశం రష్యాలో రాజకీయ శరనార్థిగా  ఆశ్రయం పొందాడు. దీంతో ఇన్నాళ్లు  అణిచివేతకు గురైన ప్రజలు దేశంలో సంబురాలు  చేసుకున్నారు.

కానీ హెచ్‌టీఎస్ అధికార పగ్గాలు చేపడుతుందనే వార్తలు వస్తు న్న నేపథ్యంలో దేశంలోని చాలామంది ప్రజలు భవిష్యత్ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామిస్ట్ గ్రూప్ అయిన హెచ్‌టీఎస్ ఇంతకుముందు తన ఆధీనంలో ఉన్న ఇడ్లిబ్ నగరంలో మైనార్టీలపై దాడులు చేసి వారిని క్రూరంగా హింసించింది. హెచ్‌టీఎస్ అధినేత అబూ మహమ్మద్ అల్ జొలానీ మాత్రం తమ పాలనలో మైనార్టీలకు ఎటువంటి హానీ చేయబోమని, వారు స్వేచ్ఛగా ఉండవచ్చని ఆదివారం డమాస్కస్ ఆక్రమణ తరువాత చెప్పాడు.

అయితే జొలానీకి ఐసిస్, అల్‌ఖైదా, ఇతర ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉండడంతో వారి ప్రభా వం జొలానీపై ఎంతవరకు ఉంటుందనే దాని పై ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సిరియాలోని మేధావులు అంటున్నారు. 1970 నుంచి 2024 వరకు నిరంకుశ పాలనను అననుభవించిన సిరియాలో ఒక్కసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అవకాశాన్ని హెచ్‌టీఎస్ ఇస్తుందా లేదా ఆఫ్గనిస్తాన్, ఇరాక్ మాదిరిగా మారుతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

 13 ఏళ్లు.. 11 రోజులు..

తన తండ్రి హఫీజ్ మరణంతో తనకు ఇష్టం లేకుండానే 2000 సంవత్సరంలో బషర్ అల్ అసద్ అధ్యక్షుడిగా పాలనా పగ్గాలు చేపట్టాడు. అప్పటినుంచి 2011 వరకు దేశంలో సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధి చేశాడు. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో అసద్ పాలనపై ప్రజల్లో అసంతృ ప్తి పెరిగింది. దీనికి తోడు 2008లో ట్యూనీషియాలో ప్రారంభమైన అరబ్ స్ప్రింగ్( అరబ్ వసంతం) ప్రభావం సిరియాపై కూడా పడింది.

ఆ సమయంలోనే దారా నగరంలో అసద్‌కు వ్యతిరేకంగా గోడలపై వ్యతిరేక వార్తలు రాసిన యువకుడిని భద్రతా దళాలు నిర్బంధించడంతో తిరుగుబాటు ప్రారంభమై దేశమం తటా వ్యాపించింది. నిరసనలను అసద్ క్రూరంగా అణిచివేశాడు. తన వ్యతిరేకులందరినీ సయ్నదా జైలులో నిర్బంధించి వారిలో చాలామందికి ఉరిశిక్ష విధించాడు. ఇదే సమయంలో జొలానీ నేతృత్వంలోని తిరుగుబా టుదారులు డమాస్కస్‌ను ఆక్రమించారు.

కానీ తన మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్ సహాయంతో దాడులు చేసి తిరుగుబాటుదారులను అతికష్టం మీద రాజధాని నుంచి బటయకు పంపా రు. ఈ క్రమంలోనే తన వ్యతిరేకులు, తిరుగుబాటుదారులపై విషపూరిత రసాయన గ్యాస్‌ల ను ఉపయోగించి చంపించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో అసద్‌పై ప్రపంచ మంతా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయన్‌తో రష్యా యుద్ధం చేస్తుండడం, ఇజ్రా యెల్‌తో యుద్ధం చేయడానికి హమాస్, హెజ్‌బొల్లా తీవ్రవాదులకు  ఇరాన్  సహాయం చేయడంపై దృష్టి పెట్టాయి.

ఇదే అదునుగా భావించిన జొలానీ..  2024 నవంబర్ 27న కొన్ని స్థానిక తిరుగుబాటుదారుల సహాయంతో దాడులు చేస్తూ  అలెప్పో నగరం, హమా, దారా, హోమ్స్ నగరాలను స్వాధీనం చేసుకున్నాడు. చివరికి డిసెంబర్ 8న డమాస్కస్‌కు ఆక్రమించాడు. దీంతో తిరుగుబాటు ప్రారంభమైన 2011 తరువాత 13 సంవత్సరాల కాలంలోనే (2024) సిరియాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గతనెల 27న దాడులు ప్రారంభించి  కేవలం 11 రోజుల్లోనే ఈనెల 8న దేశాన్ని హెచ్‌టీఎస్ తిరుగుబాటుదారులు పూర్తిగా ఆక్రమించారు. దీంతో 13 సంవత్సరాల అసద్ నిరంకుశ పాలనకు కేవలం 11 రోజుల్లోనే తెరపడింది.

తెగల మధ్య సామరస్యం సాధ్యమేనా..

దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక తెగలు ఉన్నాయి. దీంతో ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓ వైపు డ్రూజ్, కుర్దిష్ తెగలు, మైనార్టీ షియాలు, మెజార్టీ సున్నీలు తదితర స్థానిక తెగలు, జాతులు తమ పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు వివిధ ప్రాంతాల్లో స్థానిక తిరుగుబాటు సంస్థలు, ఐసిస్, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని కల్గి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో సిరియాలో ప్రశాంత వాతావారణం నెలకొంటుందా అనే సందేహం అందరిలో నెలకొన్నది.  తుర్కియే, సిరియా ఇరుదేశాల్లో  ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా మద్దతుతో కుర్దుష్ తెగ చేస్తున్న స్వాతంత్య్ర పోరాటం ఏ మలుపు తిరుగుతుందో.

కుర్దులను అణిచివేయడానికి సిరియాలో ఇన్నాళ్లు టర్కీ తన సైన్యాన్ని మోహరించింది. కుర్దుష్ పోరాటాన్ని టర్కీ మద్దతు ఉన్న హెచ్‌టీఎస్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు సిరియా ఉత్తర, ఈశాన్య ప్రాంతా ల్లో ఐసిస్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఐసిస్‌ను ఎదుర్కొవడానికి అమెరికా  అక్కడ తన దళాలను మోహరించింది. ఇవేకాక దే శంలోని వివిధ ప్రాంతాలను అనేక గ్రూపు లు పంచుకుని పాలన చేస్తున్నాయి. వీటిన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సిరియా ను పాలించడం హెచ్‌టీఎస్‌కు అతిపెద్ద సవాల్ కానుంది. ఇవేకాక టర్కీ, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాక్, లెబనాన్ తదితర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది కూ డా చర్చ నడుస్తోంది.  

సమగ్రతను గౌరవించాలి: భారత్

సిరియాలో జరిగిన పరిణామాలపై భారత్ స్పందించింది. సిరియా ఐక్యత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి అన్ని పార్టీలు కృషి చేయాలని, శాంతియుతంగా సమ్మిళిత అధికార బదిలీ జరగాలని భారత్ సూచించింది. ఈ మేరకు  భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని పేర్కొంది. తిరుగుబాటుదారుల చేతికి సిరి యా వెళ్లడంతో అక్కడున్న భారతీయుల భద్రత కోసం భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపు తోందని తెలిపింది.

కశ్మీర్‌పై సిరియా వైఖరి మారనుందా

1957లో పశ్చిమాసియా పర్యటనలో భాగంగా సిరియాను నాటి ప్రధాని నెహ్రూ సందర్శించారు. అదే సంవత్సరం సిరియా అధ్యక్షుడు షుక్రీ అల్ కువాత్లీ న్యూఢిల్లీలో పర్యటించారు. దీంతో భారత్, సిరియా దేశాల మధ్య ద్వైపాక్షిక పర్యటనలు ప్రారంభమయ్యాయి. 1967లో సిరియాలోని గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించి సిరియాకు మద్దతు తెలిపింది. ఈ క్రమంలో సిరియాలో 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటికీ అధ్యక్షుడు అసద్‌తో భారత్ స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించింది.

2017లో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసద్ మాట్లాడుతూ సిరియాలాగే భారత్ కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తూ కశ్మీర్ ముమ్మాటికీ భారత్‌దేనని నొక్కి చెప్పారు. అయితే మిగితా ఇస్లామిక్ దేశాలకు భిన్నంగా కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారమని, దాన్ని పరిష్కరించుకునే హక్కు భారత్‌కే ఉందని అసద్ ప్రభుత్వం పేర్కొన్నది. కశ్మీర్ విషయంలో పాక్‌కు టర్కీ మద్దతు ఇస్తున్నది. ఈ మధ్యకాలంలో భారత్‌తో సత్సం బంధాలను  కొనసాగిస్తూ యూఎన్‌లో టర్కీ  అధ్యక్షుడు ఎర్దోగాన్ కశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ఇష్టపడలేదు.

ఈ నేపథ్యంలో టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు  ఇపుడు  భారత్ విషయంలో ముఖ్యంగా కశ్మీర్ అంశంలో ఎటువంటి విధానాన్ని అవలంభిస్తారనేది ఎదురు చూడాలి.కాగా సిరియా అభివృద్ధి కోసం ఆ దేశంలో భారత్ పెట్టుబడులు పెట్టింది. థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 240 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చింది.  2020  నుంచి 2023 వరకు ఇరుదేశాల మధ్య 100 మిలియన్ డాలర్ల వాణిజ్యం, 2024లో 80 మిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఐటీలో పెట్టుబడులు, స్టీల్‌ప్లాంట్ ఆధునీకరణ, చమురు రంగం, బియ్యం, ఫార్మా, తదితర రంగాలల్లో పెట్టుబడులు పెట్టింది.

 లగ్జరీ కార్లు..

మరోవైపు అసద్‌కు చెందిన ప్రైవేటు గ్యారేజీలో ఉన్న వివిధ రకాల లగ్జరీ కార్లను హెచ్‌టీఎస్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. పలుకార్లను ధ్వంసం చేశారు. కోట్లు విలువైన పోర్షే, లంబోర్ఘిని, ఫెరారీ, మెర్సిడెజ్ బెంజ్, ఆడీ, ఆర్మర్డ్ ఎస్‌యూవీ వంటి లగ్జరీ కార్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకోవైపు కొం దరు తిరుగుబాటుదారులు సిరియా సెం ట్రల్ బ్యాంక్, దేశంలోని వివిధ బ్యాంకులపై దాడులు చేసి క్యాష్ బ్యాగులతో పారిపోయారు. ఈ క్రమంలో హెచ్‌టీఎస్ నాయకు డు జొలానీ ఓ ప్రకటన చేస్తూ దేశంలో ఎటువంటి ఆస్తులు ధ్వసం చేయకూడదని, ప్రభుత్వ ఆఫీసులను కూలగొట్టవద్దని విజ్ఞప్తి చేశాడు.

అసద్ ప్యాలెస్ లూటీ

అసద్ సిరియా నుంచి వెళ్లిపోగానే ఆందోళనకారులు అధ్యక్షుడి ప్యాలెస్‌లోకి చొరబడి సంబురాలు జరుపుకున్నారు. డమాస్కస్‌కు ఎదురుగా ఉన్న ఓ కొండపై  అల్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను పాలరాయితో నిర్మించారు. ఆయన ఇంట్లోని ప్లేట్స్, ఫర్నిచర్, చేతికి దొరికినకాడికి వస్తువులను ఎత్తుకెళ్లారు. కొంతమంది అసద్ దుస్తులను తీసుకెళ్లారు. మరికొంతమంది అధ్యక్ష భవనంలో సెల్ఫీలు తీసుకున్నారు. కిచెన్‌లో ఉన్న వివిధ రకాల ఫుడ్‌ను తిన్నారు. కిచెన్ సామగ్రిని తీసుకుని పోయారు.  ఎంతో విలువైన కళాఖండాలను తమ వెంట పట్టుకెళ్లారు. అలాగే ప్యాలెస్‌లోని ఓ రూములో సబ్ మెషిన్ గన్స్ ఉన్నాయి. 

అసద్ బంకర్ అద్భుతం..

 తిరుగుబాటుదారులు దేశాన్ని ఆక్రమించిన తరువాత అధ్యక్షుడు అసద్ దేశాన్ని వీడి తన కుటుంబంతో కలిసి రష్యాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలో అసద్ పారిపోగానే ఆయన నివాసంలోకి ఆందోళనకారులు, తిరుగుబాటుదారులు ప్రవేశించారు. ఆందోళనకారులు అసద్ ఇంట్లోని ప్రతి మూల వెతికారు. ఈ సందర్భంగా  ఈ క్రమంలో విలాసవంతమైన ప్యాలెస్‌లో ఓ చోట డోర్స్ తరిచిన తరువాత ‘ఫ్యామిలీ బంకర్’ను వారు కొనుగొన్నారు.

దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ బంకర్‌లో అసద్‌కు కుటుంబానికి చెందిన బంగార ఆభరణాలు, ఆయుధాల నిల్వాలు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. బంకర్ లోపంల భారీ సొరంగం, దాని చివరలో చెల్లాచెదురుగా పడి ఉన్న పెట్టెలు, ఇతర వస్తువులు, విశాలమైన రూమ్స్ ఉన్నాయి. అలాగే భారీగా బరువులను మోయడానికి వీలుగా చిన్నపాటి రైల్వే ట్రాక్‌లాంటి నిర్మాణం కూడా వీడియోలో కనపడుతోంది. బంకర్ లోపల వివిధ రూములను అత్యవసర సమయంలో వాటిని వాడుకునేలా నిర్మించారు. అసద్ పారిపోవడంతో ఇంతటి విలాసవంతమైన ప్యాలెస్‌ను తిరుగుబాటుదారులు ఎలా వినియోగిస్తారనేది చూడాలి.