12 June, 2026 | 2:02 AM

19వేల ఖాళీలు భర్తీ చేయాలి

12-06-2026 01:13 AM

పోలీసు శాఖలో ఐదు వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తామనడం అన్యాయం

మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్న కాంగ్రెస్, రెండున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిందని మాజీమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో 19 వేల ఖాళీలుంటే, కేవలం 5 వేలకే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు.

ఖాళీ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత గురువారం హైదరాబాద్‌లో హరీశ్ రావుని కలిసి.. నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో కేవలం పోలీస్ శాఖలోనే దాదా పు 48 వేల పోస్టులు భర్తీ చేసామని  గుర్తు చేశారు. 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే, అందులో 2 వేల పోస్టులు హైదరాబాద్ పరిధిలోకే వెళ్లిపోతాయని.. మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో కులానికి ఒక్క పోస్టు కూడా దక్కదన్నారు.  బీఆర్‌ఎస్ హయాంలో ఉన్నట్లుగానే కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 

నిబంధనల కఠినతరంపై అభ్యంతరం

ఈవెంట్‌లలో కూడా నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగ దరఖాస్తులకు ఫీజు ఉండ దని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వేల రూపాయలు వసూలు చేస్తుందని ఆరోపించారు. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్ లాంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం సరైన మైదానాలు లేవన్నారు. నిరుద్యోగుల కు  బీఆర్‌ఎస్  అండగా ఉంటుందన్నారు.