calender_icon.png 2 November, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు

02-11-2025 11:29:16 AM

అమరావతి: మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు  అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం 5 గంటలకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని రమేష్ కు నోటీసులిచ్చి ఆయనతోపాటు సహచరుడు ఆరెపల్లి రాములను అదుపులోకి తీసుకుంది. విచారణ కోసం రమేష్‌ను విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించారు. దీంతో జోగ రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా వాతావరణం చోటుచేసుకుంది.

నకిలీ మద్యం కేసులో అరెస్టుల సంఖ్య 20కి చేరుకుంది. ఈ కేసులో రమేష్ ను ప్రధాన నిందితుడు (A1)గా చేర్చే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దుర్మార్గమైన పాలనకు నిదర్శనం అని, నా భార్యబిడ్డల సాక్షిగా చెబుతున్నా.. నేను ఏ తప్పు చేయలేదని ఆయన వాపోయ్యారు. అయితే పోలీసుల సమాచారం ప్రకారం... అద్దేపల్లి జనార్ధన్ రావు ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు తెలిపారు. రమేష్ తనకు రూ.3 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తానని, ఆ డబ్బు ఆఫ్రికాలో డిస్టిలరీని స్థాపించడానికి సహాయపడుతుందని హామీ ఇచ్చాడని జనార్ధన్ రావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలోని ములకల చెరువుకు చెందిన జయచంద్రారెడ్డి సహాయం తీసుకుని నకిలీ మద్యం ఉత్పత్తిని ప్రారంభించమని, రమేష్ తనకు సలహా ఇచ్చాడని పేర్కొన్నారు. 2023లో రమేష్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యం తయారీ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. జనార్దన్ రావు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారని, కోర్టు ఆదేశాల మేరకు మొత్తం విచారణ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించామని పోలీసు చెబుతున్నారు. ఆఫ్రికాకు బయలుదేరే ముందు, సెప్టెంబర్ 23న జనార్థన్ రావు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చూపించే సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా సిట్ సేకరించింది. ఈ ఆధారాల ఆధారంగా, జోగి రమేష్‌ను అతని నివాసం నుండి అరెస్టు చేయడానికి సిట్ బృందం ముందుకు సాగింది.