25 May, 2026 | 10:27 AM

చింతకాని మండలంలో అభివృద్ధి పనుల జాతర

25-05-2026 09:40 AM

కోట్లాది రూపాయల నిధులతో పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం/ చింతకాని : నియోజకవర్గ అభివృద్ధియే ధ్యేయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) దూసుకుపోతున్నారు. ఆదివారం రాత్రి చింతకాని మండలంలో పర్యటించి, పలు గ్రామాల్లో సుమారు 17 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.​ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ​రవాణా సౌకర్యాల మెరుగుదలకు పెద్దపీట వేయడంతో పాటుగా ​పలు కాలనీల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని అన్నారు.

ప్రధాన అభివృద్ధి పనుల వివరాలు

​కోమట్లగూడెం - రెడ్డిగూడెం రోడ్డు: కోమట్లగూడెం గ్రామం నుంచి రెడ్డిగూడెం (కొండవనమాల) వరకు రూ. 7 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, కోమట్లగూడెం ఎస్సీ కాలనీలో 82 లక్షలతో నిర్మించే అంతర్గత సిసి రహదారులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

అనంతసాగర్ - రామకృష్ణాపురం రోడ్డు: అనంతసాగర్ నుంచి రామకృష్ణాపురం - లచ్చగూడెం జడ్పీ రోడ్డు వరకు రూ. 2.80 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అనంతసాగర్ ఎస్సీ కాలనీలో రూ. 16.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.

​మత్కేపల్లి - తిరుమలాపురం రెన్యువల్ రోడ్డు: మత్కేపల్లి నుంచి తిరుమలపురం వరకు రూ. 6.98 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెన్యువల్ బీటీ రోడ్డు పనులకు, మత్కేపల్లి ఎస్సీ కాలనీలో 36 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సిసి రహదారులకు శంకుస్థాపన చేశారు.​ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, చింతకాని తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.