25 February, 2026 | 11:27 PM

పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యం

25-02-2026 09:41 PM

52, 6వ డివిజన్‌లలో రూ.2.30 కోట్ల పనుల శంకుస్థాపనలు

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనమకొండ టౌన్,(విజయక్రాంతి): ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధి విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 52, 6వ డివిజన్‌లలో సుమారు రూ.2.30 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, వర్షపు నీటి పారుదల సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న డ్రైనేజీ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే నయీంనగర్ ప్రధాన నాలాకు అనుసంధానంగా ఉన్న కాలనీల నాలాలను పరిశీలించిన ఎమ్మెల్యే, డ్రైనేజీ నిల్వలు తరచుగా ఏర్పడకుండా సమయానుకూలంగా శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు.

వర్షాకాలంలో నీటి నిల్వల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలు మెరుగుపడితేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడ స్వాతి శ్రీనివాస్ రెడ్డి, చెన్నం మధు, మాజీ డిప్యూటీ మేయర్ అశోక్ రావు, డివిజన్ అధ్యక్షులు తడుక సుమన్ గౌడ్, శివాజీ కాంగ్రెస్ శ్రేణులు బొమ్మతి విక్రమ్, సుగుణకర్ రెడ్డి, బాలు, దేవేందర్ రెడ్డి, లక్ష్మణ్, అశ్విన్ అధికారులు  ఈఈ రవి కుమార్, డిఈ సారంగం, ఏఈ హరి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.