ఆలూరు స్టేజ్ వద్ద లారీ బీభత్సం.. నలుగురు మృతి
రంగారెడ్డి,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెవేళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపు తప్పి రోడ్డుకు ఇరువైపుల కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. లారీ వేగంగా దూసుకొచ్చి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు లారీ వెళ్తుంది. లారీ అదుపుతప్పిన విషయాన్ని చిరువ్యాపారులు దూరం నుంచే గమనించి ప్రాణ భయంతో పరుగులు తీశారు. చిరువ్యాపారులు అప్రమత్తంకావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలికి కిలోమీటర్ దూరంలో నిన్న కూడా రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు విస్తరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




