నాలుగు లక్ష్యాలు.. ఎన్నో ఆకాంక్షలు
- 2036 ఒలింపిక్స్ భారత్‌లో నిర్వహించేందుకు కృషి
- దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- పునరుత్పాదక ఇంధన వినియోగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం
- అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతాం: ప్రధాని మోదీ
- నెదర్లాండ్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో సమావేశం
ది హేగ్, మే ౧6: ‘భవిష్యత్తులో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ ఆకాంక్షిస్తున్నది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తాం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధా న్యం ఇస్తూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతాం. మున్ముందు దేశాన్ని అంత ర్జాతీయ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే చోదక శక్తిగా ఎదిగేందుకు బాటలు వేస్తాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
నెదర్లాండ్ పర్యటనలో భాగంగా శనివారం ఆయన ఆ దేశ రాజధాని ది హేగ్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తూ భారత్ నిర్దేశించుకున్న నాలుగు ప్రతిష్ఠాత్మక లక్ష్యాల (యాస్పిరేషన్స్)ను విశదీకరించారు. నెదర్లాండ్ వంటి దేశాలతో భారత్ క్రీడా సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నదని వివరించారు.
రక్షణ, మొబైల్ ఫోన్లు, సెమికండక్టర్ చిప్స్ వంటి తయారీ రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతామని ప్రతినబూ నారు. దేశాన్ని గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సౌర విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ వనరులను వినియోగిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధాల సమయంలోనూ భారత ఆర్థి క వ్యవస్థ తట్టుకుని నిలబడిందని, మున్ముందు దేశం అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే ప్రధాన చోదక శక్తిగా అవతరిస్తుందని ఆకాంక్షించారు.
భారత యువతకు అపారమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని దేశం వేగంగా అభివృద్ధి చెందు తున్నదని తెలిపారు. దేశ యువత ఆకాశాన్ని తాకేంత పెద్ద కలలు కంటున్నదని కొనియాడారు. వాటిని సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందిస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ నెట్‌వర్క్‌గా అవతరించిందని వివరించారు. ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదుగుతున్నదని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో 12 సెమికండక్టర్ ప్లాంట్ల పనులు సాగుతున్నాయని, వాటిలో రెండు ప్లాంట్లలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మౌలిక వసతుల కల్పనలో భారత్ దూసుకుపోతున్నదని తెలిపారు. దేశంలో నిర్మిస్తున్న సోలార్ పార్కులు ప్రపంచంలోనే అతిపెద్దవని పేర్కొన్నారు. పునరు త్పాదక ఇంధన సామర్థ్యంలో బ్రెజిల్‌ను దాటి భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు.
2036లో భారత్ ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాల నే కోరుకుంటున్నదని వివరించారు. ఈ లక్ష్యంతోనే నెదర్లాండ్స్‌తో తమ దేశం క్రీడా సంబంధాలను బలోపేతం చేసుకుంటందని తెలిపారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య క్రికెట్, హాకీ రంగాల్లో సత్సంబందాలు ఉన్నాయని గుర్తుచేశారు. మోదీ అనంతరం నెద ర్లాండ్స్ రాజు విల్లెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాతో భేటీ అయ్యారు.
మోదీకి ఘన స్వాగతం
నెదర్లాండ్ రాజధాని ది హేగ్ నగరంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి భారత ప్రధాని మోదీ చేరుకున్న తర్వాత ఆయనకు భారతీయులు కరతాళ ధ్వనుల మధ్య ఘనస్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండ్సెన్, డచ్ సైనిక దళాల అడ్జటెంట్ జనరల్ రియర్ అడ్మిరల్ లుడ్గర్ బ్రూమ్‌లార్, నెదర్లాండ్‌లో భారత రాయబారి కుమార్‌తుహిన్ సాదరంగా ఆహ్వానించారు. మోదీ నెదర్లాండ్స్ పర్యటన ఈనెల 17 వరకు కొనసాగనుంది. 2017లో మోదీ మొదటిసారి ఆ దేశంలో పర్యటించారు. ఇది మోదీ రెండో నెదర్లాండ్ పర్యటన కావడం విశేషం.
చోళుల శాసనాలు భారత్‌కు వాపస్
భారతదేశ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో ఒక గొప్ప మైలురాయి నమో దైంది. 11 శతాబ్దం నాటి ‘చోళ ఆనైమంగళం’ రాగి శాసనాలను భారత్‌కు అప్ప గించేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విజయం భారత దౌత్యనీతికే మకుటాయమానమని అంతర్జాతీయ దౌత్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. వలస పాలనలో తరలిపోయిన పురావస్తు సంపదను తిరిగి రాబట్టేందుకు భారత్ కొన్నేళ్ల నుంచి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నది.
దీనిలో భాగంగానే ౧౮వ శాతాబ్దంలో డచ్ పాలన లో నెదర్లాండ్‌కు తరలిపోయిన చోళకాలం నాటి శాసనాలపైనా దృష్టి సారించింది. తాజాగా ప్రధాని మోదీ పర్యటనతో ఆ కాల సాకారమైంది. ఇంతకీ ఆ శాసనాల గొప్పతనమేమిటంటే.. శాసనాలను ఇంగ్లిష్‌లో ‘లైడెన్ ప్లేట్స్’ అని పిలుస్తారు. ౧౧వ శతాబ్దం లో నాటి చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు వాటిని తయారు చేయించాడు. నాగాప ట్నం ప్రాంతం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ మిషనరీ ద్వారా ‘ఫ్లోరెంటియస్ క్యాంపర్’ అనే డచ్ అధికారి వీటిని దక్కించుకున్నాడు. ఆ తర్వా త 1862లో నెదర్లాండ్‌లోని లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి అవి చేరాయి.
అప్పటి నుంచి అదే లైబ్రరీలో శాసనాలు పురాతన వస్తువుల ప్రదర్శనలో ఉంటున్నాయి. అక్కడి ప్రభుత్వం పరిశోధకులకు మాత్రమే చూసే అవకాశం కల్పించింది. తమిళ చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ కారణంగా ఈ శాసనాలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. వాటిపై తమిళ సం స్కృతి, వారసత్వానికి చిహ్నంగా నిలిచే వివరాలు ఉంటాయి. నాగాపట్నంలో నిర్మిం చిన ‘చూడామణి విహార’ అనే బౌద్ధ విహారానికి భూమి దానమిచ్చిన ఆధారాలుం టాయి.
వాటి బరువు దాదాపు 30 కిలోలు ఉంటుంది. ఆ శాసనాలు మధ్యయుగంలో దక్షిణ భారతం, ఆగ్నేయాసియా దేశాల మధ్య ఉన్న సముద్ర వ్యాపార బంధాలను స్పష్టం చేస్తున్నాయని చరిత్రకారులు చెబుతారు. నాటి హిందూ రాజులు బౌద్ధ మత సంస్థలను ఏ విధంగా ఆదరించారో చెప్పేందుకే శాసనాలు చారిత్రక ఆధారాలని వెల్లడిస్తున్నారు.






