29 April, 2026 | 1:35 PM

పిచ్చి కుక్క కరిచి నలుగురికి తీవ్ర గాయాలు

27-04-2026 09:06 PM

చేగుంట,(విజయక్రాంతి): నార్సింగి గ్రామ సింహం స్వైరవిహారం చేస్తూ నలుగురిని కరిచిన సంఘటన మండల కేంద్రంలోని 1 వ వార్డు లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కుమ్మరి గల్లిలో ఆడుకుంటున్న చిన్నారిని ఒక కుక్క కరిచి అక్కడి నుంచి చాకలి గల్లీలో వెళ్ళి అక్కడ ముగ్గురిని కరిచింది. గ్రామస్థులు కుక్కను పట్టడానికి ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే తీవ్ర గాయాలైన నలుగురు బాధితులను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తీసుకుని వెళ్లారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సమయానికి వైద్య అధికారులు లేకపోవడం, ఎం.ఎల్.టి మాత్రమే ఉండడంతో ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. మండల వైద్య అధికారి (మహిళ) ఆరోగ్య సమస్య వల్ల దీర్ఘ కాలం సెలవులో ఉండడం, మరో వైద్యుడు కూడా సోమవారం సెలవు పెట్టడం తో, సరైన వైద్యులు లేకపోవడం తో కోపాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఒక మహిళా డాక్టరు దీర్ఘ కాలం సెలవు లో ఉన్నా, పై అధికారులు ఆమె స్థానంలో మరో వైద్యురాలిని నియమించక పోవడం తో గర్భవతులు, మహిళా రోగులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వాపోయారు.

ఈ రోజు సమయానికి ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఎం.ఎల్.టీ ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం మెదక్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవాలని సూచించారు. మెదక్ వెళ్ళడానికి 108 వాహనం కోసం చూడగా నార్సింగి కి చెందిన వాహనం మెదక్ వెళ్లగా వేచి చూడాల్సి వచ్చింది.  దాదాపు గంట వేచి చూసిన తరవాత చేగుంట నుంచి 108 వాహనం రాగా అందులో మెదక కు వెళ్లారు. కుక్కల ను నివారించి, వాటి బెడద నుంచి గ్రామ ప్రజలను కాపాడాలని, అలాగే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో మహిళా ఆరోగ్య వైద్యురాలిని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.