1 March, 2026 | 8:45 AM

౩న ఉచిత ఈఎన్టీ, వినికిడి పరీక్షా శిబిరం

01-03-2026 01:24 AM

కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ లో ఉచిత ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు), వినికిడి పరీక్షా శిబిరాన్ని నిర్వహించనుంది. వినికిడి లోపాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, చెవి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ ఏడాది థీమ్ పిల్లల్లో నివారించగల వినికిడి లోపాలు ముందస్తు గుర్తింపు, సమయానుకూల చికిత్స. చిన్నారుల్లో వినికిడి సమస్యలను తొందరగా గుర్తిస్తే భవిష్యత్తులో వచ్చే తీవ్ర సమస్యలను నివారించవచ్చనే సందేశాన్ని ఈ థీమ్ స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ ఉచిత శిబిరం మార్చి 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంజారాహిల్స్లోని కేర్ అవుట్‌పేషెంట్ సెంటర్ లోని ఈఎన్టీ అండ్ ఆడియాలజీ విభాగంలో నిర్వహించబడుతుంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణ, నివారణాత్మక వైద్య సేవల పట్ల ఆసుపత్రి నిబద్ధతకు ఇది మరో నిదర్శనం.

ఈ శిబిరాన్ని డాక్టర్ ఎన్. విష్ణు స్వరూప్ రెడ్డి , క్లినికల్ డైరెక్టర్, విభాగాధిపతి అండ్ చీఫ్ కన్సల్టెంట్ ఈఎన్టీ, ఫేషియల్ ప్లాస్టిక్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, మార్గదర్శకత్వంలో ఈఎన్టీ, ఆడియాలజీ బృందం నిర్వహించనుంది. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల మాట్లాడే తీరు, భాషాభివృద్ధి, చదువులో ప్రగతి, ఇవన్నీ వినికిడిపై ఆధారపడి ఉంటాయి.

చాలా వినికిడి లోపాలను ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు లేదా సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు అని తెలిపారు. ఈ ఉచిత శిబిరం ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచి, వినికిడి సమస్యలు ఉన్న పిల్లలకు సమయానికి వైద్యసేవలు అందించడమే మా లక్ష్యం అని తెలిపారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఓటోఅకౌస్టిక్ ఎమిషన్స్ స్క్రీనింగ్‌తో పాటు ఈఎన్టీ వైద్యుల కన్సల్టేషన్లు ఉచితంగా అందించబడతాయి. 5 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న పాఠశాల విద్యార్థులకు ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ పరీక్షతో పాటు ఈఎన్టీ కన్సల్టేషన్ ఉచితంగా నిర్వహించబడుతుంది అని తెలిపారు.

జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ మాటల్లో ఆలస్యం, తరచూ చెవి ఇన్ఫెక్షన్లు, వినికిడి లోపం, చదువులో వెనుకబాటు లేదా చెవికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ పిల్లల వినికిడి ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి అవగాహన కార్యక్రమాలు, ముందస్తు నిర్ధారణ, ఆధునిక ఈఎన్ట్టీ వైద్యసేవలను నిరంతరం అందిస్తోంది అని తెలిపారు.