24 July, 2026 | 9:08 PM

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

24-07-2026 08:37 PM

గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఇద్దరు విద్యార్థులకు స్కూల్ ఫీజుల చెల్లింపు

మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు

మేడిపల్లి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టినరోజు పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాజీ మంత్రి బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు.

ఐటీ, పారిశ్రామిక, పట్టణాభివృద్ధి రంగాల్లో తెలంగాణను దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల కల్పన, మున్సిపల్ సేవల ఆధునికీకరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ ఆదర్శనీయమని అన్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన సుబ్రత్ పరిహరి, కిరణ్ కులకర్ణి కుటుంబాల ఇద్దరు విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి వారి విద్యాభ్యాసానికి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.

అదేవిధంగా టిఎక్స్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వందలాది మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోగా, పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి,మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు ప్రభు, నాయకులు జావీద్ ఖాన్, ఆకుల మధుకర్, శ్యామల శ్రీనివాస్, మహిళా నాయకులు, యువజన నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.