21-01-2026 12:00:00 AM
ఉచిత మెడికల్ క్యాంపులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఎర్రుపాలెం జనవరి 20 (విజయ క్రాంతి): షుగర్ వ్యాధిగ్రస్తులకు లండన్ నుంచి ప్రత్యేక వైద్యులు వచ్చి ఉచితంగా వైద్య సహాయం చేయడం గొప్ప అవకాశం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మధిర పట్టణంలో యూకే స్వచ్ఛంద సంస్థ, కృష్ణంరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
షుగర్ వ్యాధిగ్రస్తులకు కాళ్లకు సంబంధించిన వ్యాధి సోకిన విషయం కూడా ఆ రోగులకు తెలియదని పరీక్షలు చేయిస్తేనే తెలుస్తుందని, ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులు ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రముఖ కథానాయకుడు కృష్ణంరాజు జన్మదినం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో వారి కుటుంబ సభ్యులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ప్రసీద చిన్ననాటి నుంచి సేవాభావంతో తన నాన్నగారి పేరిట సేవలు అందిస్తున్న ఆమెను అభినంది స్తున్నట్లు, దీవిస్తున్నట్లు తెలిపారు.
సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబంతో తమ కుటుంబానికి మంచి స్నేహబంధం ఉందని కృష్ణరాజు కూతురు ప్రసీద తన కుమారుడు సూర్య విక్రమాదిత్య స్నేహితులు, ఆ స్నేహభావంతో మధిర నియోజకవర్గం లో పేదల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరగా వారు వెంటనే అంగీకరించి ఇక్కడికి వచ్చి సేవలు అందిం చడం అభినందనీయం అన్నారు. ఈ నియోజకవర్గంలో పేదల సంఖ్య ఎక్కువగా ఉంది వారికి వైద్య సహాయం భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలను ఈ క్యాంపు ద్వారా తెలియజేయడం ఆనందదాయకం అన్నారు.
యునైటెడ్ కింగ్డమ్ లో ప్రసిద్ధ డాక్టర్ అయిన వేణు లండన్ నుంచి ఇక్కడికి వచ్చి సేవలందించడం గొప్ప విషయం అన్నారు. లండన్ వెళ్లి వేణు వద్దా చికిత్స చేయించుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు, సమయం పడుతుంది కానీ వారు నేరుగా మధిరకు వచ్చి ఎటువంటి ఖర్చు లేకుండా సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని, సూర్య విక్రమాదిత్య, కృష్ణంరాజు శ్రీమతి శ్యామలాదేవి, కృష్ణంరాజు కూతురు ప్రసీద తదితరులు పాల్గొన్నారు.