తెలంగాణ అస్తిత్వంపై మళ్లీ దాడులు
మిద్దె సురేష్ :
తొలి, మలిదశ ఉద్యమం తెలంగాణ చరిత్రలో అక్షాలే కాదు; తెలంగాణ ప్రజల పోరాటాలకు నిలువెత్తు సాక్ష్యాలవి. ఏ వస్తువును తట్టినా, చెట్టుపుట్టను కదిలించినా, కొలిమిలో ఎగిసిపడే నిప్పు రవ్వలను ముట్టుకున్నా ఉద్యమ పోరాటపటిమను తెలుపుతాయి. శత్రువుల గుండెలో గుబులు ఎందరో వీరులు, వీరనారీమణులు పుట్టిన నేల ఇది. తెలంగాణ కోసం, తెలంగాణ బాగుకోసం యుద్ధ భూమి లో పోరాటం సలిపిన వీరులు ఎందరో.
తెలంగాణ అస్తిత్వంపై దాడిచేస్తూ, తెలంగాణ సంపదను, నిధులను, నీళ్లను, నియామకాలను దోచుకుంటుంటే రక్తం మరిగిన తెలంగాణ బిడ్డలు పిడికిళ్లు ఎక్కుపెట్టి ‘జై తెలంగాణ’ అని గర్జించారు. ‘ఇదిరా నా తెలంగాణ పౌరుషం’ అంటూ శంఖారావం పూరించారు. తొలిదశ ఉద్యమంలో తుపాకి గుండ్లకు ఎదురునిలిచి ధీరత్వం చూపిన పోరాటాల గడ్డ ఇది. నాటి ఆంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే విద్యావంతులు, మేధావులు ‘జై తెలంగాణ’ నినాదంతో దిక్కులు పిక్కటిల్లెలా నినదించారు. తెలంగా ణ సమాజాన్ని ఐక్యం చేశారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో 369 మంది అమరుల రక్తంతో తడిసిన ఈ మట్టిలో అణువు అణువునా పోరాట పటిమ ఉంది. ఆ ఆనవాళ్లతో మళ్లీ పుట్టుకువచ్చిందే మలిదశ ఉద్యమం. ప్రత్యేక రాష్ర్టం వస్తే తప్ప తెలంగాణ బతుకులు మారవని భావించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ సలహా సూచనలతో, కేసీఆర్ సారథ్యంలో, ప్రజలందరి ఐక్యతతో సుధీర్ఘకాలం పోరాటంతో, విద్యార్థి అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం సిద్ధించింది.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేడు స్వార్థ రాజకీ యాలు చేస్తున్నది. కాంగ్రెస్ పాలకుల్లో ఏ ఒక్కరూ తెలంగాణ ఉద్యమంలో లేరు. పైగా తెలంగాణ ఆనవాళ్లు లేకుం డా చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వంపై దెబ్బకొడుతున్నా రు. తెలంగాణ అంటే నిత్యం వెలిగే ఉద్యమ కాగడ. అంతేకానీ, కాంగ్రెస్ పాలకులు మార్చిన తెలంగాణ తల్లి కాదు. ‘జై తెలంగాణ’ అంటే నినాదం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తల్లికి నగ లు ఎందుకని అంటున్నారు.
ఏ కొడుకు అయినా తన తల్లి ఆత్మగౌరవంతో నలుగురిలో గౌరవంగా, ధైర్యంగా ఉండాలనుకుంటాడు. అటువంటిది తెలంగాణ తల్లికి నగలు ఎందుకంటూ తక్కువ చేసి మాట్లాడటం శోచనీ యం. అధికార దర్పంతో తెలంగాణ అస్తిత్వంపై దాడిచేయడం హేయం. కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ప్రాము ఖ్యతను తెలుసుకుని పరిపాలిస్తే వారిని ఎల్లకాలం ఈ సమాజం యాది చేసుకుంటుంది. లేకపోతే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు ఈ పుడమిపై.
దేశంలో ఎక్కడైనా మేధావి వర్గం అంటేనే వివిధ ప్రాంతాలకు జరుగు తున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తూ ప్రజాభిప్రాయాలను నిత్యం విశ్లేషిస్తూ ప్రభుత్వాలకు చురకలు అంటి స్తుంది. కానీ, తెలంగాణలో తాము మేధావులమని చెప్పుకునే కొంతమంది ధన, పదవి వ్యామోహాలతో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. తెలంగాణ సమాజం వారిని ఎప్పటికీ క్షమించదు. అందుకే నాడు ప్రజా కవి కాళోజీ ‘ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో బొంద పెడతాం.
ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమితరిమి కొడ తాం’ అని అన్నారు. విద్యావంతులు, మేధావులు ఇకకైనా మీ మౌనం వీడి తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కదలాలి. తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, కృష్ణా, గోదావరి జలాల వాటా వంటి అంశాలపై నీలదీయాలి. తెలంగాణ అస్తిత్వంపై దాడిచేస్తున్న ఆంధ్ర నేతల పీచమణచి తెలంగాణ ఆత్మగౌరవ పతాక ఎగురవేయాలి.
అరవై ఏళ్లు తెలంగాణను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయం గా వెనక్కి నెట్టి తెలంగాణను అవహేళన చేసినవారికి విగ్రహాలు, పూలమాలలు వేయడం ఎంతవరకు సమంజసం. అదే సమయంలో తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు అవమానలు, చీత్కారాలా? కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేయాలని చూస్తున్నారు. ఏం మారింది? నాడు తెలంగాణ భాష, యాసపై ఆంధ్ర పాలకులు చిన్నచూపు చూస్తే, నేడు కాంగ్రెస్ నాయకులు అవార్డు, రివార్డులలో వివక్ష చూపుతున్నారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమకారులకు వేధింపులు ఎదురవుతున్నాయి.
తెలంగాణలో ఏం జరుగుతున్నది? అసలు తెలంగాణ ను ఎవరు ఏలుతున్నారు? ప్రజలు ఒక్కసారి ఆలోచించా లి. ఒకవైపు ప్రగతి సంబురాలంటూ వేడుకలు, మరోవైపు రైతులు పండించిన ధాన్యంతో కల్లాల్లో పడిగాపులు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కూడా రైతులు సంతోషం గా లేరంటే తెలంగాణ ఏర్పాటుకు సార్థకత ఎక్కడ ఉంది. కాంగ్రెస్ పాలనలో ఎవ్వరు సంతోషముగా లేరనడానికి అనేక సందర్భాలను చూశాం. ఇదేంటని ప్రశ్నించినవారిపై నిర్బంధాలు, అక్రమ కేసులు పెడుతున్నారు.
అయినా తెలంగాణ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఉద్యమ సమయంలో సోషల్ మీడియా లేదు, ఇష్టానుసారంగా ఆంధ్ర పోలీసులు లాఠీలు జులిపించినా, జైళ్లలో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా జైలు గోడలు బద్దలయ్యేలా ‘జై తెలంగాణ’ అంటూ నినాదించిన చరిత్ర తెలంగాణకు ఉంది. ఉద్యమ సమయంలోనే భయపడకుండా కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నం.
ఇప్పుడు ఈ తాటాకు చప్పులకు జంకుతామనుకుంటే అది పాలకుల భ్రమే. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ప్రజలందరూ ఉద్యమ పోరాటస్ఫూర్తితో ముం దుకుకదులుతూ గర్జించాలి. తెలంగాణ వ్యతిరేక దుష్ట శక్తులను తరిమికొట్టాలి. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం.
వ్యాసకర్త సెల్: 9701209355






