ఫలించని ఉద్యమ ఆకాంక్షలు
జూన్ 2.. తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రాత్మక రోజు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన విషయం తెలిసిందే. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదం తో దశాబ్దాల పాటు సకలజనులు సలిపిన పోరు ఫలితంగా నాలుగు కోట్ల మంది స్వప్నం సాకారమైంది. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పన్నెండు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యమ ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయనే ప్రశ్న సహజం గానే ముందుకు వస్తున్నది.
తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన మాట వాస్తవమే. ఉమ్మడి ఏపీ నాటి రోజులతో పోలిస్తే సాగునీటి ప్రాజెక్టు లు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి కనిపి స్తున్నదీ నిజమే. కానీ, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చేరాయా? అంటే అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. ఉద్యమ సమయంలో నిరుద్యోగ యువతకు కొలువులపై ఆశలు కల్పించారు.
ఆ తర్వాత స్వరాష్ట్రంలోనూ అన్ని వర్గాలకు పాలకులు అలవిగాని హామీలు ఇచ్చారు. కానీ, ఈ పన్నెండేళ్లలో రెండు ప్రభుత్వాలు మారినా ఉద్యోగాల కల్పన విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ట్టుగా పరిస్థితి తయారైంది. వ్యవసాయరంగంలో ఇప్పటికీ అన్నదాతలు మొగులు వైపు చూడాల్సిన దుస్థితి. పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌక ర్యాలు, అప్పుల భారం వంటి సమస్యలు ఇంకా రైతన్నలను వెంటాడుతున్నా యి.
ఇక నిధుల విషయానికొస్తే సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని చెప్పక తప్పదు. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు అప్పులభారాన్ని మోయలేక చతికిలపడుతున్నది. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం పరిపాలనా విభజన కోసం కాదు; సామాజిక న్యాయం, ప్రాంతీయ సమానత్వం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం జరి గిందనే విషయాన్ని మరువరాదు.
స్వరాష్ట్రం ఏర్పడటాన్ని ఉద్యమ లక్ష్యాల ముగింపుగా కాకుండా, వాటి సాధనకు ఆరంభంగా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలోని అణగారిన వర్గాల ప్రజల బతుకుల్లో మార్పు వచ్చినప్పుడే ఉద్యమం ఫలించినట్టుగా భావించాలి. పన్నెండేళ్ల తెలంగాణ ప్రయాణం నేడు ఉద్యమ ఆకాంక్షల కూడలిలో నిల్చొని ఉంది. తెలంగాణ అవతరణ దినోత్స వం సందర్భంగా గతాన్ని స్మరించుకుంటూనే, ఉద్యమ ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ముందుకుసాగాల్సిన అవసరం ఉంది.






